బంజారాహిల్స్ కు చెందిన సినిమా డిస్ట్రిబ్యూటర్ బుధవారం కిడ్నాప్‌కు గురయ్యాడు. కిడ్నాప్ చేయించింది టీడీపీ నేతేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితుడి నుంచి కోట్ల రూపాయల నగదు, భూమి పత్రాలు తీసుకొని వదిలేసినట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన వివరాలు.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వరదరాజులు కుమారుడు కొండారెడ్డికి.. ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ శివగణేశ్‌కుకు కడప జిల్లాకు చెందిన ఓ భూమి విషయంలో కొంతకాలంగా వివాదాలు చోటుచేసుకున్నాయి. దీంతో శివగణేశ్‌ను కొండారెడ్డి మనుషులు కిడ్నాప్ చేసి ఆ భూమిని దక్కించుకొనేందుకు స్కెచ్ వేసినట్టు సమాచారం.
కడప జిల్లా ప్రొద్దుటూరులో అగస్తేశ్వర దేవస్థానానికి చెందిన 18 ఎకరాల భూమిని 50 ఏళ్ల కిందట దేవరశెట్టి దంపతులు ఓ ట్రస్ట్ పేరుతో కొనుగోలు చేశారు. అనంతరం అక్కడ కళాశాలను ఏర్పాటు చేశారు. అయితే అక్కడ మిగిలిన 11 ఎకరాలను విక్రయించేందుకు అప్పటి టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులతో కలిసి ట్రస్ట్‌సభ్యులు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని కలిశారు. అయితే దేవాలయ భూమిని విక్రయించేందుకు సీఎం వైఎస్ఆర్ అనుమతి ఇవ్వలేదు. ఈ తర్వాత సీఎం అయిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఆ భూమిని విక్రయించుకొనేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో 11 ఎకరాల భూమిని 6.97 కోట్లకు ట్రస్ట్ సభ్యులు అమ్మేశారు. ఆ సమయంలో ట్రస్ట్ సభ్యుల్లో ఒకరైన శివగణేశ్.. ఎకరం భూమిని ఎమ్మెల్యేకి ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. కాగా ప్రస్తుతం ఆ భూమి విషయంలో శివగణేశ్‌కు, వరదరాజులు కుమారుడు కొండారెడ్డికి వివాదం నెలకొన్నది. అక్కడ రెండెకరాలు తనకు ఇవ్వాలంటూ కొండారెడ్డి పట్టుబట్టాడు. ఆ భూమికోసం శివగణేశ్‌ను కిడ్నాప్ చేయించినట్టు సమాచారం.