Breaking News

టీచర్ల సర్దుబాటు.. నగుబాటు!

టీచర్ల సర్దుబాటు.. నగుబాటు
  • వనపర్తి జిల్లాలో ఇష్టమొచ్చినట్లు పోస్టింగ్​లు
  • పోస్టింగ్ కోసం కొందరు ఉపాధ్యాయుల అడ్డదారులు
  • ఎమ్మెల్యే, అధికార పార్టీ నేతల రెకమెండేషన్
  • టీచర్లు కోరుకున్న స్థానాలకే కేటాయింపు
  • అక్రమ సర్దుబాటుకు ఇంచార్జ్ డీఈఓ సఫోర్ట్
  • తలలు పట్టుకుంటున్న ఇంచార్జ్ ఎంఈవోలు

సామాజికసారథి, వనపర్తి: కంచే చేను మేసిందన్న చందంగా అవినీతి, అక్రమాలను అడ్డుకోవాల్సిన అధికారులే అడ్డదారులకు సహకరిస్తుండటం వనపర్తి జిల్లా విద్యాశాఖలో చర్చనీయాంశంగా మారింది. గవర్నమెంట్ స్కూళ్ల విద్యాభివృద్దికి ప్రభుత్వం చొరవ తీసుకుంటుండడాన్ని కొందరు విద్యాశాఖ అధికారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వం టీచర్లకు పదోన్నతులు ఇవ్వడంతో పాటు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాలను సైతం ఇటీవల భర్తీ చేసింది. దీంతో కొత్త టీచర్లు జాయిన్ కావడం, మరికొందరు ప్రమోషన్లతో ఇతర స్కూళ్లకు వెళ్లిపోవడంతో జిల్లాలో అక్కడక్కడా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీన్ని గమనించిన ప్రభుత్వం టీచర్లను సర్దుబాటు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. దీన్ని ఆసరాగా తీసుకున్న కొందరు టీచర్లు రూల్స్ కు పక్కన పెట్టిన తమకు కోరుకున్న స్కూల్ లో పోస్టింగ్ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు.

పైరవీలు షురూ
సమాజానికి విద్యాబుద్దులు నేర్పి అందరికి ఆదర్శంగా ఉండాల్సిన విద్యాశాఖలో ప్రస్తుతం అవినీతి రాజ్యమేలుతోంది. కొందరు గురువులు సైతం తమ ఉద్యోగ బాధ్యతలను మరచిపోయి అడ్డదారిలో అనుకున్నది సాధించేందుకు ప్రయత్నించడం వీరికి ఏకంగా జిల్లా విద్యాశాఖ అధికారులు, కొందరు డీఈఓ ఆఫీస్ సిబ్బంది అండగా ఉండడంతో ప్రభుత్వం అమలు చేస్తున్న రూల్స్ కు అమలు కావడం లేదు. వనపర్తి జిల్లా విద్యాశాఖకు పెద్ద దిక్కు లేకపోవడం నాగర్ కర్నూల్ జిల్లా డీఈఓ గోవింద రాజులుకు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించడంతో మరింత అధ్వాన్నంగా మారింది. ప్రస్తుతం వనపర్తి జిల్లాలో జరగాల్సిన టీచర్ల సర్దుబాటు ప్రక్రియలో పైరవీల జోరు అందుకుంది. పైరవీల బాట పట్టిన కొందరు గురువులకు డీఈఓతో పాటు డీఈఓ ఆఫీస్ సిబ్బంది, ఓ కోఆర్డీనేటర్ , కొన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు అండగా ఉండడం విశేషం. పైగా రెకమెండేషన్ లెటర్లు తీసుకువస్తే రూల్స్ ను పక్కన పెట్టి మీరు కోరుకున్న స్కూల్ కు సర్ధుబాటు ఆర్డర్ ఇస్తామని సలహాలు ఇస్తున్నారు. దీంతో పైరవీల కోసం వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, ఇతర అధికార పార్టీల లీడర్లతో సిఫారస్ లెటర్లు తెచ్చి తాము కోరుకున్న స్కూళ్లకు సర్దుబాటు ఆర్డర్లు తెచ్చుకుంటున్నట్లు తెలిసింది.

టీచర్ల కోసమే సర్దుబాటు
వనపర్తి జిల్లాలో గవర్నమెంట్ స్కూళ్ల విద్యార్థుల అవసరాల కోసం టీచర్లను సర్దుబాటు చేయకుండా కేవలం కొందరు టీచర్లను కోరుకున్న స్కూళ్లకు పంపించేందుకు సర్ధుబాటు చేస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఆయా మండలాల్లో ఎక్కడ టీచర్ల అవసరం ఉందో ఆయా మండలాల పరిధి లేదా స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలోనే సర్ధుబాటు చేయాల్సీ ఉంటుంది.కాని వనపర్తి జిల్లాలో పైరవీలు చేసుకున్న వారికి వారు కోరుకున్న స్కూల్ కు పంపేందుకు సర్దుబాటు చేసేందుకు సిద్దం అయ్యారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఉదాహరణకు ఖిల్లా ఘనపురం మండలం మానాజీపేట నుంచి వనపర్తి పట్టణంలోని పీఎస్ బండారు నగర్ కు, కమాలుద్దీన్ పూర్ నుంచి వనపర్తి పట్టణంలోని పీఎస్ వల్లభ్ నగర్ కు, పెద్దమందడి మండలం నుంచి రేవల్లీ మండలానికి , రేవల్లీ నుంచి పెద్దమందడి మండలానికి బదిలీ చేస్తున్నట్లు తెలిసింది. చిన్నమందడి మండలంలోని ఓ మహిళా టీచర్ తన మండలంలో అవసరం ఉన్నా పెద్దమందడి మండలంలో ఎలాంటి ఆర్డర్ లేకుండా ఇప్పటి వరకు పనిచేయగా ఇప్పుడు సర్ధుబాటు పేరుతో ఆమెకు ఆర్డర్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. కొత్తకోట మండలం లో ఓ మహిళా టీచర్ తన స్థానంలో రూల్స్ కు విరుద్దంగా ఓ విద్యావలంటీర్ నియమించి పాఠాలు చెప్పించడంపై పత్రికల్లో వచ్చాయి. ప్రస్తుతం ఈ మహిళా టీచర్ ను వనపర్తి మండలానికి సర్ధుబాటు ఆర్డర్ ఇప్పించేందుకు జోరుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలా రూల్స్ కు విరుద్దంగా అడ్డదిడ్డంగా సర్ధుబాటు ఆర్డర్లు తయారు చేయిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారులు తమకు అందిన కాడికి దండుకుంటున్నా పట్టించుకునే స్థితిలో వనపర్తి జిల్లా యంత్రాంగం లేకపోవడం విచారకరం. టీచర్ల సర్ధుబాటు విషయంపై గురువారం జిల్లా కేంద్రంలో ఎంఈఓల మీటింగ్ జరిగింది.ఈ మీటింగ్ లో ఇంచార్జ్ డీఈఓ గోవిందరాజులు ఇలా సర్దుబాటు చేయాలని ఆదేశాలు ఇవ్వడంపై కొందరు ఎంఈఓలు విస్తుపోయారు. రూల్స్ కు విరుద్దంగా అడ్డదారిలో సర్దుబాటు ఆర్డర్లు ఇస్తే తాము స్కూళ్ల తనిఖీలకు వెళ్లినప్పుడు ఇతర ఉపాధ్యాయులు నిలదీస్తే ఏం సమాధానం చెప్పాలని మీటింగ్ నుంచి కొందరు ఎంఈవోలు అర్ధాంతరంగా వెళ్లిపోయారు. ఈ విషయం పై ఇంచార్జ్ డీఈఓ గోవింద రాజులు ను వివరణ కోరేందుకు ఫోన్ చేసినా అందుబాటులోకి రాలేదు.