- భూనిర్వాసితుడిగా రూ.రూ.6,96,637 పరిహారం
- అధికారులతో కలిసి బీఆర్ఎస్ నేత అక్రమాలు
- బిజినేపల్లి మండలం గంగారంలో ఆలస్యంగా వెలుగులోకి..
సామాజికసారథి, నాగర్ కర్నూల్: గత ప్రభుత్వ హయాంలో కొందరు నాయకులు, అధికారులు కలిసి చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ప్రాజెక్టుల్లో లేనిది ఉన్నట్లు చూపి లక్షలు మెక్కేశారు. అలాంటిదే ఓ ఉదంతం నాగర్ కర్నూల్ జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకెళ్తే.. గత ప్రభుత్వం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సాగు అందించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా పలు రిజర్వాయర్లను నిర్మించాలని తలపెట్టింది. అందుకోసం సర్కారు భూములతో పాటు రైతుల నుంచి కూడా భూములను సేకరించి అందుకు తగిన విధంగా పరిహారం అందించింది. ఈ పరిణామమే అక్రమార్కులకు వరంగా మారింది. బిజినేపల్లి మండలం గంగారం గ్రామంలో సర్వేనెంబర్ 469లో 24 గంటల భూమి ఉన్నట్లు బోగస్ రికార్డులు సృష్టించారు. ఆ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కాంతారెడ్డి, స్థానిక రెవెన్యూ అధికారులు కలిసి ప్రభుత్వానికి శఠగోపురం పెట్టారు. ప్రభుత్వం నుంచి మార్కండేయ రిజర్వాయర్ భూనిర్వాసితుడిగా సదరు కాంతారెడ్డి అక్షరాల రూ.6,96,637 తీసుకున్నారు. సర్వేనం.469లోని ఈ భూమి ప్రభుత్వ రికార్డులో సర్కారు భూమిగా 9.33 నమోదై ఉంది. ఈ విషయాన్ని అధికారులు రికార్డుల్లో పొందుపరిచారు. ఈ ఉదంతంపై గతంలో అధికారులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికైనా విచారణ జరిపి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.