- సర్వే రిపోర్ట్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నాడు
- తెల్కపల్లి మాజీ జెడ్పీటీసీపై పోలీసులకు ఫిర్యాదు
సామాజికసారథి, తెల్కపల్లి: ‘నా భూమిని అతనికి విక్రయించాలని తెల్కపల్లి మాజీ జెడ్పీటీసీ నరేందర్ రెడ్డి వేధిస్తున్నాడు’ అని తెల్కపల్లి గ్రామానికి చెందిన సింగగాళ్ల రాములు పోలీసులను ఆశ్రయించాడు. గ్రామ సర్వే నెం.52లో తనకు ఎకరా భూమి ఉందని, 40 ఏళ్లుగా సాగులో ఉన్నామని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తమనే పక్కనే సర్వే నెంబర్ 12, 13లో తెల్కపల్లి మాజీ జెడ్పీటీసీ నరేందర్ రెడ్డి వెంచర్ చేసి తన ఎకరా భూమిని అతనికి అమ్మాలని ఒత్తిడి తీసుకొస్తున్నాడని వాపోయాడు. తనకు అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ రిపోర్ట్ ఇవ్వకుండా సర్వేయర్ ను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని తెలిపాడు. నరేందర్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని వేడుకున్నాడు. భూమి ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడుతున్న మాజీ జెడ్పీటీసీ నరేందర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సింగగాళ్ల రాములు పోలీసులకు ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.