- సుప్రీంకోర్టు తీర్పునే తప్పుబడుతున్నారు
- రాజకీయ లబ్ధి కోసమే వర్గీకరణపై తప్పుడు ప్రచారం
- నాడు వంశీకృష్ణ, వివేక్ వెంకటస్వామి ఎక్కడున్నారు?
- జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వాళ్లకే దక్కాలి
- రాజ్యాంగంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అప్పుడే రాశారు
- మాదిగ ఐక్యవేదిక వ్యవస్థాపకులు మంగి విజయ్
సామాజికసారథి, నాగర్ కర్నూల్: కొంతమంది మాల ప్రజాప్రతినిధులు, మేధావులు ఎస్సీ వర్గీకరణపై తప్పుగా మాట్లాడుతున్నారని మాదిగ ఐక్యవేదిక వ్యవస్థపాకులు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు మంగి విజయ్ అన్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పునే అవహేళన చేసేలా మాట్లాడుతున్నారని ఎద్దేవాచేశారు. సోమవారం ఆయన మాదిగ జేఏసీ నాయకులతో కలిసి నాగర్ కర్నూల్ లో మీడియాతో మాట్లాడారు. ఇటీవల నాగర్ కర్నూల్ లో జరిగిన మాలల సభలో ప్రజలను తప్పుదోవపట్టించేలా నాయకులు మాట్లాడారని గుర్తుచేశారు. రాజకీయ లబ్ధి కోసమే సభలో మాట్లాడారు. పీవీ రావు, చెన్నయ్య లాంటి వాళ్లు ఉద్యమం చేసినప్పుడు చిక్కుడు వంశీకృష్ణ, వివేక్ వెంకటస్వామి, గంటా చక్రపాణి ఎక్కడికి పోయారని నిలదీశారు. వర్గీకరణ జరిగితే పింఛన్లు రావు, బ్యాంకుల నుంచి రుణాలు రావు అని మాట్లాడటం సరికాదన్నారు. ప్రగతిఫలాలను ఎవరి వాటాలో ఎంతో జనాభా దామాషా ప్రకారం పంచుకోవాలని భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాశారని గుర్తుచేశారు. ఎవరి జనాభా ఎంత ఉందో వారికి విద్య, ఉద్యోగం, ఉపాధి, రాజకీయ రంగాల్లో అంతే వాటా దక్కాలని తాము కోరుకుంటున్నామని అన్నారు. ఎస్సీల్లోని అన్ని ఉపకులాలకు అన్ని రంగాల్లో న్యాయం జరగాలని మందకృష్ణ మాదిగ నేతృత్వంలో 30 ఏళ్లుగా ఉద్యమం శాంతియుత ఉద్యమం కొనసాగుతోందని వెల్లడించారు. ఎంతో మంది మాదిగ బిడ్డలు తమ యవ్వన కాలాన్ని పోగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరెంతో మంది వర్గీకరణ ప్రతిఫలాలను చూడకముందే నేలకొరిగారని గుర్తుచేసుకున్నారు. మూడు దశాబ్దాల పాటు వర్గీకరణ ఉద్యమం శాంతియుతంగా జరిగిందని అన్నారు. అంతటి మహత్తర ఉద్యమం ద్వారానే వర్గీకరణ సాధ్యమైందన్నారు. మాదిగలు, మాలలకే కాదు.. ఉపకులాలకు సమన్యాయం జరగాలన్నదే తమ అభిమతమని పేర్కొన్నారు. తండ్రికి పుట్టిన బిడ్డలే కలిసిలేనప్పుడు ఎస్సీల్లోకి ఉపకులాలు ఎలా కలిసి ఉంటారని ప్రశ్నించారు. ఎమ్మార్పీఎస్ వర్గీకరణ ఉద్యమానికి సీపీఎం, సీపీఐ, మావోయిస్టు వంటి పార్టీలు మద్దతు ఇచ్చాయని గుర్తుచేశారు. మాలల ఉద్యమానికి ఎవరైనా సపోర్ట్ చేశారా? అని నిలదీశారు. సమావేశంలో నాయకులు జయశంకర్, లక్ష్మయ్య, కాషన్న, మన్యం, గంధం విజయ్, ప్రదీప్ తదితర నాయకులు పాల్గొన్నారు.
మందకృష్ణ మాదిగ 30 ఏళ్లుగా పోరాడుతున్నారని మీరే చెప్తున్నారు ఆయన సారథ్యంలో మీరు పని చేస్తే పోయేదేముంది.. ఇలా ఎవరికివారు మీటింగ్లు పెట్టుకొని గొప్పలు చెప్పుకునే దానికంటే పార్టీలను పక్కకెట్టి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి అడుగుజాడల్లో నడిచి ఐక్యంగా వర్గీకరణ ఫలాలను సాధించుకోవడానికి ముందడుగు వేయాలి అని కోరుకుంటున్నాం జై మాదిగ జై మందకృష్ణ మాదిగ