
- సీనియర్లకు కోరుకున్న స్కూళ్లు కేటాయించలేదు
- స్పౌజ్ కేటగిరీల్లో అక్రమాలు జరిగాయి
- విద్యాశాఖలో ఆ ఇద్దరినీ తొలగించండి
- ఉపాధ్యాయుల అనుమానాలను నివృత్తి చేయండి
- జిల్లా కలెక్టర్ కు టీఎస్ యూటీఎఫ్ నేతల వినతి
సామాజికసారథి, నాగర్ కర్నూల్: దీర్ఘకాలికంగా జిల్లా విద్యాశాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఏసీఈ రాజశేఖర్ రావు, డీసీఈబీ సెక్రటరీ సత్యనారాయణరెడ్డి, వెంకటేశ్వర్లు శెట్టిని పరిపాలన అధికారాల నుంచి తొలగించాలని టీఎస్ యూటీఎఫ్ నేతలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ను కలిసి డిమాండ్ చేశారు. టీచర్ల బదిలీల్లో స్పౌజ్ కేటగిరీల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. గురువారం ఈ మేరకు టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆర్.కృష్ణ, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎం.శ్రీధర్ శర్మ, కె.శంకర్, ఎ.చిన్నయ్య, ఎం.రమాదేవి, జె.బాలరాజు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. కౌన్సెలింగ్ లో ఉద్దేశపూర్వకంగానే కొందరికి ఆశించిన ప్రదేశాలకు బదిలీలు కాలేదని పేర్కొన్నారు. స్కూలు అసిస్టెంట్ జీవశాస్త్రం విభాగంలో రోస్టర్ పాయింట్లు పాటించలేదని ఆరోపించారు. ఎస్జీటీ బదిలీల్లో సీనియర్లు కోరుకున్న స్కూళ్లను జూనియర్లకు కేటాయించారని పేర్కొన్నారు. ఎస్ఏ ఫిజిక్స్ పోస్టులను ఉద్దేశపూర్వకంగా కొందరికి కేటాయించలేదని తెలిపారు. పదోన్నతుల కేటాయింపులో పారదర్శకత పాటించలేదన్నారు. టీచర్ల సీనియారిటీ జాబితాలో తప్పులను సరిచేయలేదన్నారు. జిల్లా విద్యాశాఖలో నెలకొన్న అనిశ్చితి, అనుమానాలను నివృత్తి చేసి ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని టీఎస్ యూటీఎఫ్ నేతలు కలెక్టర్ కలెక్టర్ బాదావత్ సంతోష్ ను కోరారు. డీఈవోకు ఎన్నిసార్లు విన్నవించినా సమస్యలు పరిష్కారం కావడం లేదని పేర్కొన్నారు. మీరైనా పరిష్కరించాలని లిఖితపూర్వకంగా విన్నవించారు.