ఢిల్లీ: ప్రముఖ సినీనటి, కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి ఖుష్బూ సోమవారం మధ్యాహ్నం బీజేపీలో చేరారు. ఉదయం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆమె మధ్యాహ్నానికే బీజేపీలో చేరారు. ఉదయం ఆమెను పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవి నుంచి తొలగిస్తున్నట్టు అధిష్ఠానం ప్రకటించింది. కొద్ది సేపటికే ఆమె అధినేత్రి సోనియాకు రాజీనామా లేఖను పంపారు. పార్టీలోని కొందరు నేతలు తనను రాజకీయంగా అణగదొక్కుతున్నారని ఆమె లేఖలో పేర్కొన్నారు.
కొంతకాలంగా ఆమె కాంగ్రెస్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యావిధానం బాగుందంటూ ప్రశంసలు కురిపించారు. దీంతో సొంతపార్టీ నుంచే విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఖుష్బూ బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆమె పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఆమె చేరికతోనైనా తమిళనాట బీజేపీ బలపడుతుందేమోనని పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. తమిళనాడులో భిన్న రాజకీయాలు ఉంటాయి. అక్కడి ప్రజలు ప్రాంతీయపార్టీలను విస్మరించి జాతీయ పార్టీలను ఆదరించిన దాఖలాలు తక్కువ. ఈ నేపథ్యంలో ఖుష్బూ చేరికతో బీజేపీకి లాభమెంతో వేచిచూడాలి.