Breaking News

బీజేపీకి సిద్ధాంతం లేదు.. రాద్ధాంతమే

బీజేపీకి సిద్ధాంతం లేదు.. రాద్ధాంతమే

సారథి న్యూస్, హైదరాబాద్: బీజేపీకి ఒకప్పుడు సిద్ధాంతం ఉండేదని, ఇప్పుడది అబద్ధాలతో రాద్ధాంతం చేసే పార్టీగా మారిందని మంత్రి టి.హరీశ్​రావు ఎద్దేవాచేశారు. గోబెల్స్ ప్రచారంతో అబద్ధాల పునాదుల మీద బీజేపీ రాజకీయంగా ఎదగాలని అనుకుంటోందని, ఆ వ్యవహారశైలిని టీఆర్ఎస్​ కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సోమవారం పటాన్ చెరులో నిర్వహించిన జీహెచ్ఎంసీ ఎన్నికల సన్నాహక సమావేశంలో టీఆర్ఎస్ ​నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి హరీశ్​రావు మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీలు ఏం చేశాయని ఓట్లు వేయాలని సూటిగా ప్రశ్నించారు.

70ఏళ్ల కాంగ్రెస్, బీజేపీ పాలనలో పటాన్ చెరుకు కనీసం మంచినీళ్లు ఇవ్వలేదన్నారు. ఆడబిడ్డలు నీటి ట్యాంకర్లు వద్ద పడిగాపులు గాసే పరిస్థితి ఉండేదని గుర్తుచేశారు. మంచి నీటిసమస్య తీరుస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి రూ.251కోట్ల వ్యయంతో ఇంటింటికి తాగునీరు ఇచ్చిన ఘనత టీఆర్​ఎస్​ ప్రభుత్వానికే దక్కిందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇన్వర్టర్లు, జనరేటర్లకు పనిలేకుండా పోయిందన్నారు. కోతలు లేని నాణ్యమైన కరెంట్​ను ఇంటింటికి ఇస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, పటాన్​చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, గోపాల్ రెడ్డి, మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఒంటేరు ప్రతాప్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.