సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హేమంత్ హత్యకేసులో పలు కీలక నిజాలు వెలుగుచూస్తున్నాయి. హేమంత్ హత్యకు నెలముందే స్కెచ్వేసినట్టు సమాచారం. ఈ హత్యకు కీలక సూత్రధారి అవంతిక మేనమామ యుగందర్‌రెడ్డి అని పోలీసులు తెలిపారు. అతని కేసులో ఏ1గా పెట్టారు. యుగంధర్‌రెడ్డి నెలక్రితమే హేమంత్ హత్యకు స్కెచ్ వేసినట్టు సమాచారం.. పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం.. చందానగర్‌కు చెందిన లక్ష్మారెడ్డి, అర్చన దంపతుల కుమార్తె అవంతికి జూన్ 10న ఇంట్లో నుంచి పారిపోయింది. జూన్ 11న తన ప్రియుడు హేమంత్‌ను పెళ్లిచేసుకుంది. అయితే కూతురు వేరే కులం అబ్బాయిని పెళ్లిచేసుకోవడాన్ని లక్ష్మారెడ్డి జీర్ణించుకోలేకపోయాడు. కూతురు ఇంట్లో నుంచి వెళ్లిపోయాక లక్ష్మారెడ్డి కుటుంబం కొన్నిరోజులపాటు ఎక్కడికి బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయింది.
ఈ విషయంపై లక్ష్మారెడ్డి తీవ్ర మనోవేదన చెందేవాడు. ఈ క్రమంలో తన బావమరిది (భార్య అర్చన సోదరుడు) యుగందర్రెడ్డితో ఈ విషయంపై చర్చించాడు. దీంతో ఎలాగైనా హేమంత్‌ను హత్యచేస్తే అవంతిక తిరిగి వస్తుందని వీళ్లు ప్లాన్చేశారు. ఈ క్రమంలో యుగందర్‌రెడ్డి, అతడి సోదరుడు విజయేందర్‌రెడ్డి.. హేమంత్ హత్యకు ప్లాన్చేశారు. గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీలో ఉంటున్న హేమంత్ ఇంటివద్ద చాలా రోజులపాటు రెక్కీ నిర్వహించారు. అనంతరం ఈ నెల 24న మధ్యాహ్నం యుగందర్‌రెడ్డి అతడి బంధువులు మొత్తం 12 మంది హేమంత్ ఇంటికి వచ్చారు.
ముందు వారు అవంతిక, హేమంత్ దంపతులతో మంచిగానే మాట్లాడారు. అనంతరం ఇంటికి వెళ్దామంటూ వాళ్లు తమ కార్లో ఎక్కించుకున్నారు. అయితే కారు ఔటర్‌రింగ్‌రోడ్డు వైపు వెళ్తుండటంతో హేమంత్, అవంతికకు డౌట్ వచ్చి అరవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో అవంతిక అక్కడినుంచి పారిపోగా.. హేమంత్ వాళ్లకు దొరికాడు. ( అవంతికను కావాలనే తప్పించినట్టు సమాచారం) అయితే అవంతిక వెంటనే 100కు ఫోన్‌చేసినా ఎవరూ పట్టించుకోలేదని నిన్న ఆరోపించాదు. హేమంత్ తండ్రికూడా ఇదే ఆరోపణ చేశాడు. అయితే హేమంత్ యుగందర్‌రెడ్డి, విజయేందర్‌రెడ్డితోపాటు మరికొందరు కిరాయి హంతకులు తీవ్రంగా కొట్టి కారులోనే హత్యచేశారు. అయితే ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న లక్ష్మారెడ్డి, అతడి భార్య అర్చన ముందే పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారు సీన్లో లేకుండా జాగ్రత్తపడ్డారు.