Breaking News

పరువుహత్యకు సూత్రధారులు వీళ్లే!

సారథి న్యూస్​, హైదరాబాద్​: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హేమంత్​ హత్యకేసులో పలు కీలక నిజాలు వెలుగుచూస్తున్నాయి. హేమంత్​ హత్యకు నెలముందే స్కెచ్​వేసినట్టు సమాచారం. ఈ హత్యకు కీలక సూత్రధారి అవంతిక మేనమామ యుగందర్​రెడ్డి అని పోలీసులు తెలిపారు. అతని కేసులో ఏ1గా పెట్టారు. యుగంధర్​రెడ్డి నెలక్రితమే హేమంత్​ హత్యకు స్కెచ్ వేసినట్టు సమాచారం.. పోలీసులు రిమాండ్​ రిపోర్ట్​లో వెల్లడించిన వివరాల ప్రకారం.. చందానగర్​కు చెందిన లక్ష్మారెడ్డి, అర్చన దంపతుల కుమార్తె అవంతికి జూన్​ 10న ఇంట్లో నుంచి పారిపోయింది. జూన్​ 11న తన ప్రియుడు హేమంత్​ను పెళ్లిచేసుకుంది. అయితే కూతురు వేరే కులం అబ్బాయిని పెళ్లిచేసుకోవడాన్ని లక్ష్మారెడ్డి జీర్ణించుకోలేకపోయాడు. కూతురు ఇంట్లో నుంచి వెళ్లిపోయాక లక్ష్మారెడ్డి కుటుంబం కొన్నిరోజులపాటు ఎక్కడికి బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయింది.

ఈ విషయంపై లక్ష్మారెడ్డి తీవ్ర మనోవేదన చెందేవాడు. ఈ క్రమంలో తన బావమరిది (భార్య అర్చన సోదరుడు) యుగందర్​రెడ్డితో ఈ విషయంపై చర్చించాడు. దీంతో ఎలాగైనా హేమంత్​ను హత్యచేస్తే అవంతిక తిరిగి వస్తుందని వీళ్లు ప్లాన్​చేశారు. ఈ క్రమంలో యుగందర్​రెడ్డి, అతడి సోదరుడు విజయేందర్​రెడ్డి.. హేమంత్​ హత్యకు ప్లాన్​చేశారు. గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీలో ఉంటున్న హేమంత్​ ఇంటివద్ద చాలా రోజులపాటు రెక్కీ నిర్వహించారు. అనంతరం ఈ నెల 24న మధ్యాహ్నం యుగందర్​రెడ్డి అతడి బంధువులు మొత్తం 12 మంది హేమంత్​ ఇంటికి వచ్చారు.

ముందు వారు అవంతిక, హేమంత్​ దంపతులతో మంచిగానే మాట్లాడారు. అనంతరం ఇంటికి వెళ్దామంటూ వాళ్లు తమ కార్లో ఎక్కించుకున్నారు. అయితే కారు ఔటర్​రింగ్​రోడ్డు వైపు వెళ్తుండటంతో హేమంత్​, అవంతికకు డౌట్​ వచ్చి అరవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో అవంతిక అక్కడినుంచి పారిపోగా.. హేమంత్​ వాళ్లకు దొరికాడు. ( అవంతికను కావాలనే తప్పించినట్టు సమాచారం) అయితే అవంతిక వెంటనే 100కు ఫోన్​చేసినా ఎవరూ పట్టించుకోలేదని నిన్న ఆరోపించాదు. హేమంత్​ తండ్రికూడా ఇదే ఆరోపణ చేశాడు. అయితే హేమంత్​ యుగందర్​రెడ్డి, విజయేందర్​రెడ్డితోపాటు మరికొందరు కిరాయి హంతకులు తీవ్రంగా కొట్టి కారులోనే హత్యచేశారు. అయితే ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న లక్ష్మారెడ్డి, అతడి భార్య అర్చన ముందే పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారు సీన్​లో లేకుండా జాగ్రత్తపడ్డారు.

కుటుంబసభ్యులతో అవంతిక