Breaking News

తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత

ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి క్షేత్రంలో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. సీఎం జగన్​ డిక్లరేషన్​ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ కొడాలి నాని ప్రకటించడం.. దాన్ని బీజేపీ, టీడీపీ, వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి పట్టు వస్త్రాలు ఇచ్చేందుకు బుధవారం తిరుమలకు చేరుకున్నారు. దీంతో తిరుపతిలో టీడీపీ, బీజేపీ, హిందూసంఘాలు తిరుపతిలో మోహరించాయి. ఓ వైపున పోలీసులు తీవ్ర ఆంక్షలు విధించారు. ఇప్పటికే పలువురు నేతలను అరెస్ట్​ చేశారు. మీడియా సిబ్బందిపై కూడా ఆంక్షలు కొనసాగుతున్నాయి. బుధవారం సీఎం జగన్ నేరుగా ఢిల్లీ నుంచి రేణిగుంటకు వస్తారు. అక్కడి నుంచి తిరుమలకు వెళ్తారు. దీంతో రేణిగుంట ఎయిర్‌పోర్టులో మీడియాపై పోలీసులు ఆంక్షలు విధించారు.

జగన్ తిరుపతి పర్యటన సందర్భంగా మీడియాకు ఆంక్షలు విధించినట్లు చెబుతున్నారు. మీడియా ప్రతినిధులను ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లిపోవాలని పోలీసులు చెబుతున్నారు. పోలీసుల తీరుపై మీడియా ప్రతినిధులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ, బీజేపీ నేతల ఇళ్ల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు పులివర్తి నాని, ఎమ్మెల్సీ దొరబాబు, పుంగనూరులో శ్రీనాథ్‌రెడ్డి, అనూష రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టువస్త్రాలను సాంప్రదాయబద్ధంగా కుటుంబంతో కలసి వచ్చి సమర్పించాలని ముఖ్యమంత్రిని టీడీపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఓ వైపు డిక్లరేషన్​ వివాదం కొనసాగడం.. మరోవైపు కొడాలి నాని వ్యాఖ్యలతో హిందూసంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.