Breaking News

చెరువుల్లో ఆక్రమణలను కూల్చివేయాల్సిందే..

చెరువుల్లో ఆక్రమణలను కూల్చివేయాల్సిందే..

సారథి న్యూస్, హైదరాబాద్: జీహెచ్ఎంసీతో పాటు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న చెరువులు, నాలాలపై ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు మంత్రి కె.తారక రామారావు వివరించారు. సాగునీటి శాఖ చీఫ్ ఇంజనీర్, జీహెచ్ఎంసీ ప్రత్యేక కమిషనర్ ఆధ్వర్యంలో నీటివనరుల సంరక్షణ, ఆక్రమణల తొలగింపు పనులు చేపట్టాలన్నారు. ఆదివారం ఇరిగేషన్, జలమండలి, హెచ్ఎండీఏ, రెవెన్యూ యంత్రాంగం, ఇతర శాఖల అధికారులతో కలిసి విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న చెరువులు, నాలాలపై పూర్తిస్థాయిలో స్టడీ చేయాలని సంబంధిత అధికారులతో సూచించారు. చెరువు కట్టలను అవసరమైన మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. వర్షాలు, వరదను అంచనా వేస్తూ ఆయా చెరువుల్లో నీటినిల్వలు, వాటర్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లోను నియంత్రించేందుకు అవసరమైన చర్యలను తీసుకోవాలని నిర్ణయించారు. ఇక నుంచి కఠినమైన నిబంధనలు అమలుచేస్తామని స్పష్టంచేశారు. చెరువుల్లో అక్రమంగా భవనాలు నిర్మిస్తే, ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వాటిని కూల్చివేసే అధికారం మున్సిపల్​శాఖకు ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. సమావేశంలో హైదరాబాద్​ మహానగర మేయర్ బొంతు రామ్మోహన్, సాగునీటి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్, మున్సిపల్​ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, సాగునీటి, మున్సిపల్​ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.