Breaking News

ఇండ్ల నుంచి ఎవరూ బయటికి రావొద్దు

ఇండ్ల నుంచి ఎవరూ బయటికి రావొద్దు

సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్​ కర్నూల్​ జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు, చెరువులు, కుంటలు ఇప్పుడిప్పుడే నిండుగా ప్రవహిస్తున్నాయి. భారీగా వానలు కురుస్తున్న నేపథ్యంలో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు. ఈ క్రమంలో బిజినేపల్లి పోలీసులు పరిసర గ్రామాల ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. ఏ పని లేకుండా బయటికి రావొద్దని సూచించారు. ‘ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా పాతబడ్డ ఇళ్లల్లో ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతున్న తరుణంలో చెట్ల కింద ప్రజలు ఉండొద్దు. అలాగే విద్యుత్ స్తంభాలు, విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండాలి. రోడ్లపై ఎక్కువ మొత్తంలో వర్షపు నీరు ప్రవహిస్తున్న ప్రాంతాల్లో వాహన చోదకులు జాగ్రత్తగా గమనించి ప్రయాణించాలి. నిరంతరం కురుస్తున్న వర్షానికి ప్రమాదాలు జరిగితే పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వండి.’ అని బిజినేపల్లి ఎస్సై నాగశేఖర రెడ్డి కోరారు. విపత్కర పరిస్థితుల్లో డయల్​ 100, లేదా సెల్​ నం.8712657714 ఫోన్​ చేయాలని ఆయన కోరారు.