- ఎమ్మెల్యే అనుచరుడి పేరుతో అడ్డగోలు దందాలు
- మూడు గ్రామాలపై పెత్తనం చెలాయిస్తున్న దందాలరెడ్డి
- అడ్డుకట్ట వేయకపోతే అధికార కాంగ్రెస్ కు గట్టిదెబ్బే
సామాజికసారథి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలానికి చెందిన ఓ కాంగ్రెస్ లీడర్ నిర్వాకం అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడినంటూ ఆ లీడర్ చేస్తున్న అరాచకాలు అన్నీఇన్ని కావు. అధికార పార్టీ లీడర్ నంటూ బిజినేపల్లి మండలంలో ఏకంగా మూడు గ్రామాలపై పెత్తనం చెలాయిస్తుండటంపై స్థానిక కాంగ్రెస్ నాయకులు గుర్రుగా ఉన్నారు. ఆరంభంలోనే ఆ లీడర్ గలీజ్ దందాలకు అడ్డుకట్ట వేయకపోతే మూడు గ్రామాల కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్ పార్టీ కి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీలో విషపు రెడ్డి అరాచకాలు ప్రస్తుతం మండలంలో సంచలనంగా మారుతున్నాయి. ఈయన చోటా మోటా లీడర్ అయినప్పటికి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండటం, నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందినవాడే కావడంతో తన ఇల్లీగల్ దందాకు తెరలేపాడు. ఏకంగా నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డిని ‘నేనే గెలిపించిన’ అంటూ తాను ప్రధాన అనుచరుడనని ప్రచారం చేసుకుంటూ అడ్డగోలు దందాలకు తెగబడుతున్నాడు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు నుంచి బిజినేపల్లి మండలంలో అన్నీ ఇల్లీగల్ పనులకు పాల్పడుతున్నాడు.
దందా ఇదే
బిజినేపల్లి మండలంలో ఇసుక, నల్లమట్టి దందాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నాడు. సాగునీటి రిజర్వాయర్ ప్రాజెక్ట్ వద్ద కంకర, డస్ట్ ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తూ దర్జాగా సొమ్ము చేసుకుంటున్నాడు. అంతేకాకుండా బిజినేపల్లి ఎవరైనా తాను చేసే దందాలను ప్రశ్నిస్తే దురుసు మాటలతో బెదిరింపులకు దిగుతున్నాడు. అంతేకాదు గుడ్లనర్వలో నకిలీ భూముల వ్యవహారంపై గ్రామస్తులు ఫిర్యాదుచేశారు. జిల్లా కలెక్టర్ రద్దు చేసిన భూముల్లో నల్లమట్టి కోసం సెటిల్ మెంట్లకు పాల్పడుతున్నాడు. ప్రాజెక్టుల వద్ద ఇసుక తవ్వకాలు చేపడుతూ అందినకాడికి దండుకుంటూ ప్రశ్నించేవారిపై బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ప్రాజెక్టు వద్ద ఆయన విలాసాల జీవితానికి ఆయన కారుకు ఉచిత డీజిల్ పోయాల్సిందేనని బెదిరింపులకు దిగుతున్నాడు. ఈయన చేసే అక్రమ దందాలపై కారుకొండ, గుడ్లనర్వ, పాలెం గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు గుస్సా అవుతున్నారు. రోజూ పోలీస్ స్టేషన్ లో ఉండి తనకు గిట్టనివారు ఉంటే అక్రమ కేసులు పెట్టించి చాలా మందిని ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. అధికార పార్టీ నాయకుడి పేరుతో కాంగ్రెస్ పార్టీకి చెడ్డపేరు తీసుకొస్తుండటంపై ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి భారీగా డ్యామేజ్ జరుగుతోందని వెంటనే పార్టీ పెద్దలు స్పందించాలని కోరుతున్నారు. బిజినేపల్లి మండలంలో ఆయన చేస్తున్న ఇసుక, నల్లమంటి దందాలతో భూముల సెటిల్ మెంట్లపై దృష్టిసారించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Andhra