Breaking News

మొక్కజొన్న తోటలో..

మొక్కజొన్న తోటలో..

సారథి న్యూస్​, హైదరాబాద్​: మొక్కజొన్న పంట, దాని ఉత్పత్తి, మద్దతు ధరల విషయంలో అధికార టీఆర్‌ఎస్‌ నేతలకు స్పష్టత కొరవడిందా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ అంశంపై సీఎం కేసీఆర్‌ సమక్షంలో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా, అందుకు భిన్నంగా అధికార పార్టీకి చెందిన చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి పార్లమెంట్​లో మరో రకమైన వాదన వినిపించారు. ‘దేశంలో ప్రస్తుతం 2.42 కోట్ల మెట్రిక్‌ టన్నుల మొక్కజొన్నలు మాత్రమే అవసరం. కానీ అంతకు మించి 3.53 కోట్ల మెట్రిక్‌ టన్నుల మక్కల లభ్యత ఉంది. అంటే 1.11 కోట్ల మెట్రిక్‌ టన్నుల నిల్వలు అదనంగా ఉన్నాయి. దీనికితోడు వానాకాలంలో దేశవ్యాప్తంగా మరో 2.04 కోట్ల ఎకరాల్లో సాగవుతున్న దాదాపు 4.1 కోట్ల మెట్రిక్‌ టన్నుల పంట త్వరలోనే మార్కెట్లోకి విడుదలవుతుంది. అందువల్ల ఈ ఏడాదికే కాకుండా వచ్చే సంవత్సరానికి కూడా సరిపడా స్టాకు ఉంది’ ఇదీ సీఎం సమీక్ష సారాంశం.

కానీ ఇందుకు పూర్తి భిన్నమైన రీతిలో ఎంపీ రంజిత్‌రెడ్డి.. ఇటీవల లోక్‌సభలో మాట్లాడటం గమనార్హం. ‘దేశంలో మొక్కజొన్న కొరత ఉంది. దీంతో ఆ పంట మీద ఎక్కువగా ఆధారపడే ఫౌల్ట్రీ పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయింది..’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇతర దేశాల నుంచి మొక్కజొన్నను దిగుమతి చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని ఎంపీ కేంద్రాన్ని కోరారు. దీనికి రివర్స్‌గా సీఎం సమీక్షలో.. ‘కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి అదనంగా మరో ఐదు లక్షల మెట్రిక్‌ టన్నుల మొక్కజొన్నలను దిగుమతి చేసుకోవడానికి నిర్ణయించడమనేది పరిస్థితులను మరింత దిగజార్చింది. మొక్కజొన్నల మీద విధించే 50 శాతం దిగుమతి పన్నును 35 శాతానికి తగ్గించి కేవలం 15 శాతం పన్నుతో విదేశాలనుంచి వాటిని దిగుమతి చేసుకునేందుకు కేంద్రం నిర్ణయించింది’ అని పేర్కొనడం గమనార్హం. మొక్కజొన్నకు సంబంధించి ఇలా సీఎం కార్యాలయం, ఎంపీ పరస్పర విరుద్ధమైన ప్రకటనలు, వాదనలు చేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.