సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం శానాయిపల్లి తండా పరిసర అటవీ ప్రాంతంలో గత కొద్దిరోజులుగా పులి.. రైతులు, గ్రామస్తులను భయపెడుతోంది. రాత్రివేళ ఈ అటవీమృగం గాండ్రింపులతో హడలిపోతున్నారు. తాజాగా బిజినేపల్లి మండలంలోని శానాయిపల్లితండాకు చెందిన వాల్యానాయక్ అనే రైతుకు చెందిన పశువులపై పులి దాడిచేసి ఆవు దూడను చంపేసింది. కాగా, కొద్దిరోజులుగా రాత్రిపూట పులి గాండ్రింపులు వినిపిస్తున్నాయని చెబుతున్నారు. సమీప రైతుల పొలాల్లో ఇటీవల పులి జాడలను కూడా గుర్తించినట్లు చెబుతున్నారు. బోరుబావుల వద్దకు వెళ్లాలంటేనే రైతన్నలు హడలిపోతున్నారు. ఇదిలాఉండగా, గురువారం సాయంత్రం శానాయిపల్లి తండా పరిసర పొలాల్లో పెద్ద పులి కనిపించింది. ఇది గమనించిన స్థానిక రైతులు భయాందోళనకు గురై ఊరులోకి పరుగెత్తారు. పులిని సి సి కెమెరా లో చిత్రీకరించారు. వేసవి కాలం కావడంతో అడవి ప్రాంతాల్లో మేత దొరక్కపోవడం, తాగునీళ్లు కూడా లేకపోవడంతో పులులు ఇలా రైతుల పొలాల వద్ద వస్తున్నాయని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు తక్షణమే స్పందించి పులిని బంధించి ఈ ప్రాంతం నుంచి తరలించాలని రైతులు, పరిసర గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
- May 3, 2024
- Archive
- Top News
- TELANGANA
- తెలంగాణ
- Comments Off on శానాయిపల్లితండాలో పులి– ఆవు దూడపై దాడి