Breaking News

ఆర్ఎస్పీని మించినోళ్లు లేరు

ఆర్ఎస్పీని మించినోళ్లు లేరు

  • మల్లు రవి గెలిస్తే ఢిల్లీలో డబ్బు సంచులు పంచుతాడు
  • ప్రవీణ్​ కుమార్​ గెలిస్తే ప్రజల గొంతుక అవుతారు
  • మతం పేరుతో రాజకీయాలు చేస్తున్న బీజేపీని ఓడించాలి
  • బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కె.తారక రామారావు

సామాజికసారథి, అలంపూర్​: నాగర్​ కర్నూల్​ ఎంపీగా డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు మించిన ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్, బీజేపీలో ఎవరూ లేరని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కె.తారక రామారావు అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవిని గెలిపిస్తే రేవంత్ రెడ్డికి ఇచ్చిన డబ్బు సంచులు ఢిల్లీలో పంచడానికి పనికొస్తాడని విమర్శించారు. ప్రవీణ్ కుమార్ ను గెలిపిస్తే పేదల కష్టాలు తీర్చడానికి పార్లమెంట్ లో ప్రజల గొంతుక అవుతారని అన్నారు. మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ లో ఏర్పాటుచేసిన బీఆర్​ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ 10 ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తే రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సంభవిస్తాయని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు పార్లమెంటులో గళం విప్పాలంటే బీఆర్​ఎస్​ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిపక్ష నేత కేసీఆర్ ను ఉద్దేశించి మొగోడివైతే ఒక్క ఎంపీ సీటు గెలవాలని అంటున్నారని నిజంగా రేవంత్ మొగోడైతే ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలుచేసి ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు.

మతం పేరుతో రాజకీయాలు
లోక్‌స‌భ‌ ఎన్నికల కోసం సీఎం రేవంత్ రెడ్డి కొత్త మోసం మొదలపెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మోసం పార్ట్ 1 అసెంబ్లీ ఎన్నికల కోసం చేశారని, ఇప్పుడు రుణమాఫీ ఆగస్ట్ 15 నాడు చేస్తానంటూ పార్లమెంట్ ఎన్నికల కోసం మోసం పార్ట్ 2 చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 420 హామీలు ఇచ్చి గద్దె నెక్కిన కాంగ్రెస్ మాట తప్పిందని.. రైతు బంధు లేదు, పంట బోనస్ రావడం లేదన్నారు. మొగాడివైతే రెండు లక్షల రుణమాఫీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. కృష్ణాజలాల్లో వాటా తేల్చమని పదేళ్ల నుంచి అడుగుతున్నా కేంద్రం స్పందించడం లేదని వాపోయారు.
మతం పేరుతో దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్న పార్టీని ఓడించాలన్నారు బీజేపీ నేతలు ఓట్ల కోసం అక్షింతలు ప్రతి ఊరికి పంపి రాజకీయాల చేస్తున్నారు కానీ కేసీఆర్ మాత్రం వరి ధాన్యాన్ని పండించి దేశానికి అన్నం పెట్టారని గుర్తుచేశారు. కులమతాలకు అతీతంగా పాలించే గులాబీ జెండానే తెలంగాణకు శ్రీరామరక్ష అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో భరోసా అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను కోరారు.

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధైర్యవంతుడు
కేసీఆర్ ద్వారా పదవులు పొందిన అందరూ పార్టీని వదిలివెళ్తుంటే.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాత్రం బీఆర్ఎస్ లోకి వచ్చారని కొనియాడారు. కాంగ్రెస్ ఆహ్వానించినా తిరస్కరించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తమ పార్టీలోకి వచ్చారని, అధికారం కాదని వచ్చిన ధైర్యవంతుడని ప్రశంసించారు. నాగర్ కర్నూల్ ఎంపీగా గెలిస్తే ప్రవీణ్ ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తారని చెప్పారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని.. ఎంపీగా ఆయన గెలిస్తే తమ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఉన్న నియోజకవర్గంగా అలంపూర్ నిలుస్తుందన్నారు. లోక్‌స‌భ‌ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 8 నుంచి 10 సీట్లు గెలిస్తే.. ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు వస్తాయన్నారు. సభలో మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, అలంపూర్, గద్వాల ఎమ్మెల్యేలు విజయుడు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నారు.