Breaking News

అన్న నువ్వు గెలువాలనే.. !

  • మా పార్టీ నాయకులను మీ పార్టీలో చేర్పిస్తా
  • మీకు నా చేతనైన డబ్బు సాయం అందిస్తా
  • ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి ఓ మాజీ ఎమ్మెల్యే ఆఫర్
  • నాగర్‌కర్నూల్ సెగ్మెంట్‌లో ఆసక్తికర పరిణామం

సామాజికసారథి, నాగర్ కర్నూల్: 1రాజకీయాల్లో ఎవరు శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని అనడానికి ప్రత్యక్ష సాక్షంగా నిలువబోతున్నారు ఓ మాజీ ఎమ్మెల్యే. వరుస విజయాలతో ఇన్నాళ్లూ అధికారం అనుభవించిన సదరు మాజీ ఎమ్మెల్యే గత అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఘనవిజయం సాధించారు. అయితే గెలిచిన ఎమ్మెల్యే, జిల్లాకు చెందిన మంత్రి మీ ఓటమి కోసం పనిచేస్తున్నారని ఆరోపణలు చేస్తూ ప్రత్యర్థి పార్టీకి చెందిన ఎంపీ అభ్యర్థికి తాను సాయం చేస్తానంటూ ఆఫర్ ఇచ్చారు. తన పార్టీ నాయకులు ఎవరుకావాలో చెప్పాలని వారిని కాంగ్రెస్ లో చేరుస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఆర్థిక సాయం కూడా అందిస్తానని మాటిచ్చారని నాగర్ కర్నూల్ పార్లమెంట్ లోని ఓ నియోజకవర్గంలో అంతా చెవులు కొరుక్కుంటున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో రాజకీయాల్లో గతంలో ఓ వెలుగు వెలిగిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆయా నియోజకవర్గం లో తన ప్రభావం నిలబెట్టుకునేందుకు నానా యాతనలు పడుతున్నారు. తనపై గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను ప్రమేయం లేకుండా అదేపార్టీలోకి రావాలని ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. జిల్లాకు చెందిన మంత్రి, ఎమ్మెల్యేలు తనను అడ్డుకుంటున్నారని తీవ్ర ఆక్రోశం వెల్లగక్కుతున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ అభ్యర్థితో కుమ్మక్కు అయ్యి ఆయనను గెలిచేందుకు సహకారం అందించి ఎలాగైనా పార్టీలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన దగ్గరి వారే అంటున్నారు.ఇందుకు నానా పాట్లు పడుతున్నారు. గతంలో వరుస విజయాలతో తిరుగులేని నాయకుడినని విర్రవీగిన సదరు నేత మారిన రాజకీయ పరిస్థితులతో అయోమయానికి గురయ్యారు. పదవిలేని తనను తాను ఊహించుకోలేక పోతున్నారు. తనపై గెలిచిన నేతను నియోజకవర్గంలో సొంత పార్టీలో ఇబ్బంది పెట్టేందుకు అదే పార్టీలో తన వారిని చేర్చి ఇబ్బందులకు గురిచేయాలని పావులు కలుపుతున్నారు. ఈయన వ్యవహారం రాజకీయ విశ్లేషకుల సైతం ఆశ్చర్యం కలిగిస్తోంది.

సర్వత్రా చర్చ ఇదే..
ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానంలో కాంగ్రెస్ తరపున ఎంపీ అభ్యర్థిగా మల్లు రవి పోటీలో ఉండగా ఆయనకు ప్రత్యర్థులుగా బీజేపీ నుండి సిట్టింగ్ ఎంపీ పి.రాములు కుమారుడు భరత్, ఇటీవల బీఆర్ఎస్ పార్టీలో చేరిన పూర్వ గురుకులాల సెక్రటరీ, మాజీ ఐపీఎస్ అధికారి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గట్టి పోటీ ఇస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేసిన సదరు మాజీ ఎమ్మెల్యే తన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆయన ఆ పార్టీకి చెందిన ఎంపీ అభ్యర్థిని గెలిపించడం ద్వారా ఆ పార్టీలోకి వచ్చేందుకు పథకం రచిస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా అదే పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మె ను జిల్లా మంత్రిని ఇబ్బందులు పెట్టేందుకు సదరు నేత తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌లోని అనైక్యత ను క్యాష్ చేసుకోవడానికి ఈయన చేస్తున్న ప్రయత్నం ఎటు దారి తీస్తుందోనన్న ఆసక్తి వ్యక్తమవుతోంది. సొంత పార్టీ ప్రత్యర్థి నుంచి కాదని ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి ఆర్థికంగా సాయం చేస్తానంటూ ఆఫర్లు ఇవ్వడం , తెరవెనక మంతనాలు జరపడంపై నాగర్ కర్నూల్ పార్లమెంట్ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

  1. ↩︎