Breaking News

మల్లు రవి సారూ.. ఇదేం తీరు?

మల్లు రవి సారూ.. ఇదేం తీరు?
  • పార్టీని ఓడించాలని చూసిన వారిని ఎలా ఆహ్వానిస్తారు?
  • నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి తీరుపై కేడర్​ గుస్సా

సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్​ కర్నూల్​ ఎంపీ అభ్యర్థి డాక్టర్​ మల్లు రవిపై కేడర్​ లో అసహనం వ్యక్తమవుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గ్రామాల్లో తిరగనీయకుండా కార్యకర్తలపై దాడిచేసి వాళ్లను తిరిగి మళ్లీ ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవడం పట్ల పలు నియోజకవర్గాల్లో అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయి. ఇలా చేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మేలు జరిగే కంటే కీడు ఎక్కువగా జరుగుతుందని, పార్టీ కోసం గత పది సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం మూడు నాలుగు నెలలు అయినప్పటికీ గతం పది సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉన్న తమను విస్మరించి కొత్తగా పార్టీలోకి నాయకులను ఎలా ఆహ్వానిస్తారని పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి మల్లు రవి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

గెలుపు అంత ఈజీ కాదు
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు ఒకసారి ఎంపీగా పనిచేసిన మల్లురవి నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గవ్యాప్తంగా చాలావరకు పరిచయాలు ఉన్నాయని ఈజీగా అతని గెలుపు ఉంటుందని అందరూ భావిస్తున్నారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న చర్యల వల్ల మాత్రం నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు . గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీకి పనిచేసే కాంగ్రెస్ పతనానికి కారకులైన నాయకులను ప్రస్తుతం పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కనీసం స్థానిక ఎమ్మెల్యేలకు సమాచారం లేకుండా గ్రామాలలో కాంగ్రెస్ పార్టీని ఉనికి లేకుండా చేసిన నాయకులను దగ్గరకు తీయడం ఏమిటని అడుగుతున్నారు. ఎమ్మెల్యేలకు అసెంబ్లీ ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేసిన వారిని ఆహ్వానిస్తే గత పది సంవత్సరాలుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నాయకుల పరిస్థితి ఏమిటని ప్రస్తుతం వారు అధికారం చూసుకొని కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని సీనియర్ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుల్లో మల్లు రవి చుట్టూ వారే ఉండటం చూసి కార్యకర్తలు విస్తుపోతున్నారు. పార్టీని ఓడించాలని చూసిన వారిని పక్కన తీపుకోవడంతో కార్యకర్తలు లోలోపల బాధపడుతున్నారు. గత నాలుగు రోజుల క్రితం నుండి బిజినేపల్లి మండలంలోని ఓ బీఆర్​ఎస్​ లీడర్​ ను కాంగ్రెస్​ లోకి చేర్చుకోవాలని చూడగా, కార్యకర్తలు అడ్డుచెప్పడంతో అదికాస్తా ఆగిపోయింది. కల్వకుర్తి నియోజకవర్గంలోనూ ఇదే జరిగింది. ఇలాగే కార్యకర్తల అభిప్రాయం తెలుసుకోకుండా బీఆర్​ఎస్​ వారిని చేర్చుకుంటే మల్లు రవికి ఎదురుదెబ్బ తప్పదని సొంత పార్టీ నాయకులే హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *