Breaking News

ప్రచారానికి కొన్నిగంటలే!

ప్రచారానికి కొన్నిగంటలే!
  • మోదీ చరిష్మాతో బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ ప్రచారం
  • నేడు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా పర్యటనతో మరింత ఉత్సాహం
  • జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో సహకరించని సీనియర్ నేతలు

సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికల సమరానికి తెలంగాణ రాష్ట్రంలో నేటితో ఎన్నికల ప్రచార గడువు ముగియనుంది. నాలుగో విడతలో భాగంగా సోమవారం తెలంగాణ రాష్ట్రంలోని 17 నియోజకవర్గాలలో పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి నేటి సాయంత్రంతో ప్రచార గడువు ముగుస్తుండటంతో అభ్యర్థులు పోల్ మేనేజ్ మెంట్​ పైన దృష్టిపెట్టనున్నారు. దీనికి ఆదివారం ఒక్కరోజు కీలక కావడంతో ఏయే నియోజకవర్గాల్లో ఏ వ్యూహాలను అనుసరించాలి, ఎక్కడెక్కడ తమకు అనుకూలంగా లేని పరిస్థితులను మార్చుకోవాలన్న దానిపై దృష్టిసారించారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలలో దేశం అంతట మోదీ మానియా నడుస్తుండడంతో రాష్ట్రంలో కూడా ఆయన హవా కొనసాగనుందనే సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితులు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా పోతుగంటి భరత్ ప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఇంతవరకు నాగర్ కర్నూల్ నియోజకవర్గంపై బీజేపీ జెండా ఎగరకపోవడంతో ఇక్కడ అంతా గెలవదన్న సంకేతాలు వెలువడ్డాయి. అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి భరత్ ప్రసాద్ ప్రచారంలో అన్నీ తానే ఒక్కడిగా వ్యవహరిస్తున్నారు. తండ్రి రాజకీయ అనుభవాన్ని ఆసరాగా చేసుకుని నియోజకవర్గాల్లో ఉన్న బీజేపీ లీడర్లతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. కొన్ని యువత నుంచి ఆయనకు మద్దతు లభిస్తుంది. కానీ కొన్ని నియోజకవర్గాల్లో సీనియర్ నేతలు అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తుండడం పార్టీకి నష్టంగా మారే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా నాగర్ కర్నూల్ జిల్లాలోని ఓ ప్రధాన పోస్టులో ఉన్న నాయకుడు తన నియోజకవర్గంలో పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి కేంద్రీకరించకుండా అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గం క్యాడర్ ఉండటం ఆచారి పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతున్నారు. అలంపూర్, గద్వాల, వనపర్తి నియోజకవర్గాల్లో డీకే అరుణ పెద్దఎత్తున మద్దతు ఇస్తున్నారు.

ఢిల్లీ నేతలతో ప్రచారం
రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్న దేశంలో మాత్రం భారతీయ జనతా పార్టీ నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా ఉండాలన్న విషయం గ్రామాల్లో బాగా ప్రచారం సాగుతోంది. ప్రతిపక్ష పార్టీలు మాత్రం ప్రచారంలో వెనకబడ్డాయని చెప్పొచ్చు. భారతీయ జనతా పార్టీ యువత ప్రతిరోజు గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ నరేంద్రమోదీకి ఓటువేయాలని అభ్యర్థిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు కావడంతో నియోజకవర్గాలు కూడా ఎక్కువ స్థాయిలో ఉండడంతో అన్ని గ్రామాలను అభ్యర్థి తిరగలేకపోవడంతో యువతనే ముందుకు వచ్చి ప్రచారం చేస్తున్నారు. భరత్ ప్రసాద్ వారంలో ప్రతిరోజు ఒక్కో నియోజకవర్గంలోని గ్రామాలను చుట్టేస్తున్నారు. ముఖ్యనేతల సమావేశాలను ఏర్పాటుచేస్తూ జాతీయ స్థాయి నుంచి కూడా పెద్ద నేతలను తీసుకొచ్చి ప్రచారం చేయించడం భారతీయ జనతా పార్టీకి కలసొచ్చే అంశంగా ప్రచారం సాగుతోంది.

నేటి అమిత్ షా ప్రచారంతో జోరు
బీజేపీ పార్లమెంటరీ అభ్యర్థి భరత్ ప్రసాద్ కు మద్దతుగా ఈనెల 11న కేంద్ర హోంమంత్రి అమిత్ షా వనపర్తి జిల్లా కేంద్రంలో బహిరంగ సభ నిర్వహిస్తుండటంతో ఈ సభకు అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. శనివారం ప్రచారానికి తుది గడువు ఉండడంతో జిల్లాలో అమిత్ షా ప్రచారం చేయడం కలసివచ్చే అంశంగా ఉంది . దీంతో పార్టీకి మరికొంత ఊపు వచ్చే అవకాశం ఉందని నాయకులు చెబుతున్నారు. ఎన్నికల ప్రచార గడువు ముగిసినప్పటికీ పోల్ మేనేజ్మెంట్లో ఆయా నియోజకవర్గాలలో ఉన్న కీలక నేతలు సమన్వయం చేసుకుని కార్యకర్తలకు మరికొంత ఉత్సాహాన్ని ఇస్తే భారతీయ జనతా పార్టీ ఇక్కడ కచ్చితంగా విజయం సాధిస్తుందని సీనియర్లు అంచనా వేస్తున్నారు . కానీ కొన్ని నియోజకవర్గాల్లో సమన్వయ లోపం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీలో ప్రధాన పోస్టుల్లో ఉన్న కొంతమంది నాయకులు ఇలా సహకరించకపోవడం భరత్ ప్రసాద్ కు ఇబ్బందిగా మారుతుందని మరికొందరు విశ్లేషిస్తున్నారు.