- నోటిఫికేషన్ రాక ముందే రాజకీయ వేడి
- మండలాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల హాడావిడి
- బీజేపీ నేతల మకా..గాడిన పడని కాంగ్రెస్
- పల్లెల్లో నేతల మోహరింపు
సారథి న్యూస్, దుబ్బాక: రాజకీయ పార్టీలు అధికారికంగా తమ అభ్యర్థులను ప్రకటించకముందే దుబ్బాక నియోజకవర్గంలో ప్రచారం ముమ్మరమైంది. ఎవరికి వారే అన్నట్లుగా ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటివరకు ఏ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించకున్నా స్థానికంగా మాత్రం రాజకీయ సందడి నెలకొన్నది. ఇప్పటికి ఎన్నికల ప్రకటన సైతం వెలువడలేదు కానీ ప్రచారం మాత్రం ముమ్మరంగా సాగుతుంది.
టీఆర్ఎస్ జోరు
గ్రామాల సమస్యలపై టీఆర్ఎస్ శ్రేణుల ఆరా అధికార పార్టీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, పార్టీ ముఖ్యులను మోహరించారు. అన్ని మండలాలకు ఉమ్మడి జిల్లా లోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను ఇన్ చార్జులుగా నియమించారు. దుబ్బాక మండలానికి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, చేగుంట మండలానికి నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, నార్సింగి మండలానికి నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, తొగుట మండలానికి ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, రాయపోల్ మండలానికి జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, దౌల్తాబాద్ మండ లానికి ఎడీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మిరుదొడ్డి మండలానికి సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకరకు ఇన్‌చార్జిగా బాధ్యతలను అప్పగించారు. సిద్దిపేట, గజ్వేల్ మున్సిపాలిటీల కౌన్సిలర్లతో పాటు సిద్దిపేట, గజ్వేల్, మెదక్ నియోజకవర్గాల సర్పంచులతోపాటు పక్కనే ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్, గంబీర్ రావుపేట మండలాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులకు గ్రామాల వారీగా | బాధ్యతలను అప్పగించారు. వారంతా మొదట గ్రామాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతేగాక గ్రామాల్లో అసమ్మతులను బుజ్జగించే పనిని నెత్తికెత్తుకున్నారు. మంత్రి హరీశ్ రావు సైతం పలువురు సర్పంచులకు ఫోన్ చేసి ఆయా గ్రామాల్లో పరిస్థితులను తెలుసుకుంటున్నారు. అయితే పలుచోట్ల టీఆర్ఎస్ పార్టీపై, ముఖ్యనేతల తీరుపై ప్రతి కూలత కనిపిస్తున్నదనే విమర్శలున్నాయి.
బీజేపీ దూకుడు
80 శాతం గ్రామాల్లో బీజేపీ ప్రచారం పూర్తి దుబ్బాక నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఇంటింటి ప్రచారంలో ప్రతిగడప చుట్టేసి, అభ్యర్థి తానే అయ్యి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రావు ప్రచారం సాగిస్తున్నారు. అధికారికంగా బీజేపీ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించకపోయినప్పటికీ, నియోజకవర్గంలోని సుమారు 80శాతం గ్రామాలను ఇప్పటికే ఆయన పూర్తిచేశారు. నిజామాబాద్, కరీంనగర్ పార్ల మెంట్ఎన్నికల ఫార్ములాను అవలంభిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రచారాన్ని విస్తృతం చేస్తున్నారు. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థి నాయకులు, పార్టీ శ్రేణులు, సంఘ్ పరివార్ కార్యకర్తలు ఇంటింటా తిరిగి ప్రచారం చేస్తున్నారు.
కత్తి కార్తీక ఎంట్రీ..
తెరపైకి కత్తి కార్తీక స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగాలనుకున్న టీవీ యాంకర్ కత్తి కార్తీక మాత్రం గ్రామాలను చుట్టేస్తున్నారు. కుల సంఘాల నాయకులను, వివిధ వర్గాలను కలిసి మద్దతు అడుగుతున్నారు. పది మంది యువకులున్న ప్రతి చోట తానే సెల్ఫీలు దిగి హల్‌చల్ చేస్తున్నారు. తనను ఆదరించాలని కోరుతున్నారు.