అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ కార్యకర్తలు అధినేత చంద్రబాబు వైఖరితో డీలా పడిపోయారట. కరోనా నెపంతో టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ కే పరిమితమయ్యారు. కనీసం యువనేత లోకేశ్ కూడా వారిని పలుకరించడం లేదు. దీంతో తెలుగుదేశం కార్యకర్తలు తీవ్ర నిస్తేజంలో కూరుకుపోయినట్టు సమాచారం. మరోవైపు ఏపీలో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇటీవలే ఆ పార్టీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ ఏపీలో పర్యటించి కీలకవ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉందని.. ఆ స్థానాన్ని భర్తీచేయాలని ఆయన బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ విషయంపై టీడీపీ ముఖ్యనేతలందరూ మౌనంగా ఉండిపోయారు. దీంతో తెలుగు తమ్ముళ్లు నిరాశకు గురయినట్టు సమాచారం.
తమను పట్టించుకునేవారు లేకుండా పోయారని వారు అంతర్గతంగా చర్చించుకుంటున్నారట. కనీసం లోకేశ్ బాబు అయినా.. బయటకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడితే బాగుంటుందని టీడీపీ ద్వితీయశ్రేణి నాయకులు కొందరు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. అమరావతి ఉద్యమంలో టీడీపీ యువనేత పాల్గొని రైతులకు బాసగా నిలిస్తే పార్టీకి కొంత లాభం చేకూరుతుందని వారు భావిస్తున్నారు. తమ అధినేత చంద్రబాబు నిరంతరం జూమ్ యాప్ ద్వారా ప్రెస్మీట్లు పెట్డడం. యువనేత ట్వీట్లు చేస్తూ కాలక్షేపం చేస్తే పార్టీకి ప్రయోజనం ఉండదని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రజల్లోకి వచ్చి ప్రభుత్వ విధానాలను ఎండగడితే బాగుంటుందని వారు కోరుకుంటున్నారట. కనీసం ఇప్పటికైనా చంద్రబాబు హైదరాబాద్‌ను వీడి వస్తారో లేదో వేచిచూడాలి.