సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని శ్వేత కేసు గంటగంటకో మలుపు తిరుగుతోంది. ప్రియుడు అజయ్ వేధింపులు భరించలేకే శ్వేత ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అయితే తల్లిదండ్రుల వాదన మరోవిధంగా ఉంది. తమ కూతురును అజయ్ హత్యచేసి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. కాగా, పోలీసులు ఇప్పటికే అజయ్‌ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
కేసు నేపథ్యం ఇదీ..
హైదరాబాద్‌లోని మేడిపల్లికి చెందిన శ్వేత.. హైటెక్ సిటీలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. సెప్టెంబర్ 18 నుంచి ఆమె కనిపించడం లేదు. 19న కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. చివరకు మంగళవారం ఘట్కేసర్ రైల్వే ట్రాక్‌పై శ్వేత డెడ్‌బాడీ దొరికింది. అయితే యువతి మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎవరీ అజయ్.. శ్వేతకు ఎలా పరిచయం
హైదరాబాద్‌కు చెందిన అజయ్, శ్వేత కొంతకాలం క్రితం ప్రేమించుకున్నారు. అయితే ప్రస్తుతం వీరిద్దరికీ బ్రేకప్ అయినట్టు సమాచారం. ఈ క్రమంలో శ్వేతతో క్లోజ్‌గా ఉన్న ఫొటోలను అజయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆమె తీవ్ర డిప్రెషన్‌కు వెళ్లిపోయింది. ఈ ఫొటోలు తీసేయాలంటూ వీరిద్దరి మధ్య చాలా డిస్కషన్ నడిచినట్టు సమాచారం. శ్వేత.. అజయ్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఫొటోలను తీసేయాలంటూ ఎంతో ప్రాధేయపడింది. ఇందుకు సంబంధించిన ఆడియో కూడా ప్రస్తుతం బయటకు వచ్చింది. సోషల్ మీడియా ఫొటోలపై శ్వేత సైబర్‌క్రైం పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అయినప్పటికీ ఏ చర్యలు తీసుకోలేదని సమాచారం.
మా అమ్మాయిని అజయ్ తీసుకెళ్లాడు..
శ్వేతను ఈ నెల 18న అజయ్ బయటకు తీసుకెళ్లాడని.. అతడే హత్య చేసి ఉంటాడని శ్వేత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కూతురు సోషల్ మీడియా ఫొటోలపై ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.