- హైదరాబాద్‌లో వరద బాధితులకు ప్రభుత్వం చేయూత,
- పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.50వేలు
- జిల్లాల కలెక్టర్లు, బృందాలు వెంటనే రంగంలోకి దిగాలి
- భరోసా కల్పించిన సీఎం కె.చంద్రశేఖర్‌రావు
సారథి న్యూస్, హైదరాబాద్: భారీవర్షాలు, వరదల వల్ల హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఎన్నో కష్ట నష్టాలకు గురయ్యారని, వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు భరోసా కల్పించారు. హైదరాబాద్ నగరంలోని వరద ముంపునకు గురైన ప్రతి ఇంటికి రూ.10వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని సీఎం ప్రకటించారు. ఈ ప్రక్రియను మంగళవారం ఉదయం నుంచే ప్రారంభిస్తామని వెల్లడించారు.
వర్షాలు, వరదల వల్ల ఇల్లు పూర్తిగా కూలిపోయిన వారికి రూ.లక్ష చొప్పున, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.50వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు సీఎం ప్రకటించారు. దెబ్బతిన్న రహదారులు, ఇతర మౌలిక వసతులకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి మళ్లీ మామూలు జీవన పరిస్థితులు నెలకొనేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పేదలకు సాయం అందించడం కోసం మున్సిపల్ శాఖకు ప్రభుత్వం రూ.550 కోట్లను తక్షణం విడుదల చేస్తుందని సీఎం చెప్పారు.
ఇంత వరద ఎన్నడూ చూడలే
‘వందేళ్లలో ఎన్నడూ లేనంత భారీవర్షం హైదరాబాద్ నగరంలో కురిసింది. ప్రజలు అనేక కష్టనష్టాలకు గురయ్యారు. ముఖ్యంగా నిరుపేదలు, బస్తీల్లో ఉండేవారు, లోతట్టు ప్రాంతాల్లో నివసించేవారు ఎక్కువ కష్టాల పాలయ్యారు. వారిని ఆదుకోవడం ప్రభుత్వ ప్రాథమిక విధి. కష్టాల్లో ఉన్న పేదలకు సాయం అందించడం కన్నా ముఖ్యమైన భాద్యత ప్రభుత్వానికి మరొకటి లేదు. అందుకే ప్రభావిత ప్రాంతాల్లోని పేదలకు ఇంటికి రూ.10వేల చొప్పుల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించాం’అని సీఎం వెల్లడించారు.
వెంటనే రంగంలోకి దిగాలి
హైదరాబాద్ నగర పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు, వారి బృందాలు వెంటనే రంగంలోకి దిగి మంగళవారం ఉదయం నుంచే ఆర్థిక సాయం అందించే కార్యక్రమం చేపట్టాలని సీఎం ఆదేశించారు. నగరంలో 200 నుంచి 250 బృందాలను ఏర్పాటుచేసి, అన్ని చోట్లా ఆర్థికసాయం అందించే కార్యక్రమం పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు.
బాధ్యతగా ముందుకురావాలి
పేదలకు సాయం అందించడం అతి ముఖ్యమైన బాధ్యతగా స్వీకరించి హైదరాబాద్ నగరానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ అంతా భాగస్వాములు కావాలని చెప్పారు. నష్టపోయిన ప్రజలు ఎంతమంది ఉన్నా సరే, లక్షల మందికైనా సరే, సాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం చెప్పారు. కాబట్టి బాధిత కుటుంబాల వివరాలు అధికారులకు చెప్పి సాయం అందించాలని కోరారు.