- వడ్ల కొనుగోళ్లలోనూ రాజకీయమే
- రొటేషన్ పద్ధతి పాటించని మెప్మా
- కలెక్టర్కు ఫిర్యాదుచేయనున్న మహిళా సంఘాలు
సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: వడ్ల కొనుగోలులోనూ రాజకీయ నడుస్తోంది. నాగర్ కర్నూల్నగర పంచాయతీల పరిధిలో మెప్మా ఆధ్వర్యంలో నడుస్తున్న కొనుగోలు సెంటర్లలో అధికార పార్టీ మద్దతుదారులైన మహిళా సంఘాలకే కట్టబెడుతూ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు కేంద్రాల నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించింది. వీటిని ఒక్కో ఏడాది ఒక్కో మహిళా సంఘం నిర్వహించడం ద్వారా ఆయా సంఘాలకు వచ్చే కమీషన్లతో సంఘం బలోపేతమవుతుంది. అయితే నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో మెప్మా ఆధ్వర్యంలో నడిచే వడ్ల కొనుగోలు కేంద్రాల్లో మాత్రం అధికారులు రొటేషన్ పద్ధతి కాకుండా అధికార పార్టీ ఏ సంఘానికి చెబితే వారికి మాత్రమే వడ్ల కొనుగోలు బాధ్యతలను అప్పగిస్తూ మిగతా సంఘాలను విస్మరిస్తున్నారు. దీంతో మిగిలిన సంఘాల మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులతో తమ బాధ చెప్పినప్పటికీ లాభం లేకపోయిందని వాపోతున్నారు.
ఇదేం లెక్క?
నాగర్ కర్నూల్ మున్సిపల్ వైస్ చైర్మన్ బాబురావు సతీమణి నాగమణి నేతృత్వం వహిస్తున్న శ్రీ పరమేశ్వరి స్లమ్లెవల్సంఘానికి ఇప్పటికే రెండుసార్లు వడ్ల కొనుగోలు కేంద్రాల బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం మరోసారి కూడా వారికే ఇచ్చారు. దీనిపై ఎమ్మెల్యే స్థాయిలో చక్రం తిప్పుతున్నారని మిగతా సంఘాల మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మెప్మా పీడీ, నాగర్ కర్నూల్ మున్సిపల్ కమిషనర్ కు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడం లేదని మిగతా సంఘాల ప్రతినిధులు వాపోతున్నారు. సివిల్ సప్లయీస్అధికారులను విన్నవించినా లాభం లేదని, అధికార పార్టీ చెప్పిన వారికే వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తూ కలెక్టర్ కు ఫిర్యాదు చేసేందుకు వారు సిద్ధమవుతున్నారు.