Breaking News

బయోమెట్రిక్ అటెండెన్స్ యంత్రాన్ని దుర్వినియోగపరచిన టీచర్ సస్పెన్షన్‌

సామాజిక సారథి ఎఫెక్ట్:-
సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం లొట్టలోని పల్లి తాండా ప్రాథమిక పాఠశాల ఎస్జీటీ టీచర్ సాయి రెడ్డిపై సోమవారం డీఈఓ డాక్టర్ గోవిందరాజులు సస్పెన్షన్‌ వేటు వేశారు. ఎస్జీటీ టీచర్ సాయిరెడ్డి ఓ టీచర్ యూనియన్ జిల్లా అధ్యక్షులుగా చలామణి కావడంతో పాటు డ్యూటీకు వెళ్లకుండా ఇంటినుంచి వివిధ ప్రాంతాల నుంచి బయోమెట్రిక్ ద్వారా అటెండెన్స్ వేస్తున్న విషయంపై సామాజిక సారథిలో మూడు రోజుల క్రితం నాడ్యూటీ… నా ఇష్టం శీర్షికన కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంపై స్పందించిన జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ విచారణ చేసి చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూల్ డీఈఓ గోవింద రాజులును ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో విచారణ చేపట్టగా స్కూల్ లో ఉంచాల్సీన బయోమెట్రిక్ అటెండెన్స్ మిషన్ ను రూల్స్ కు విరుద్దంగా 70 శాతం తన వద్దే పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు అటెండెన్స్ వేసినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో పాటు సక్రమంగా విధులు నిర్వహించకుండా జీతం మాత్రం రెగ్యులర్ గా తీసుకుంటుండడంతో సోమవారం టీచర్ సాయిరెడ్డిని విధుల నుండి సస్పెన్షన్ చేసినట్లు డీఈఓ గోవిందరాజులు తెలిపారు.తిమ్మాజిపేట ఎంఈఓ ద్వారా సదరు ఉపాధ్యాయుడికి సస్పెన్షన్ ఉత్తర్వులను అందజేసేందుకు ఆర్డర్ కాపీని పంపించినట్లు డీఈఓ తెలిపారు.కాగా నాగర్ కర్నూల్ జిల్లాలో గవర్నమెంట్ స్కూళ్లల్లో అమలవుతున్న బయోమెట్రిక్ అటెండెన్స్ డీఈఓ, ఎంఈఓ, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంల నిర్లక్ష్యంతో సక్రమంగా అమలు కావడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టీచర్ల బయోమెట్రిక్ అటెండెన్స్ ను పరిశీలించకుండానే ప్రతి నెల జీతాల బిల్లులు చేస్తుండడంతో దొరికితేనే దొంగ.. లేకపోతే దొర అన్న చందంగా మారిపోయింది. ఇప్పటికైనా జిల్లాలో టీచర్ల బయోమెట్రిక్ అటెండెన్స్ ను ప్రతి నెల సక్రమంగా పరిశీలించి జీతాలు చేస్తేనే ప్రజాధనాన్ని ఇలాంటి వారి నుంచి కాపాడే అవకాశం ఉందని విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు భావిస్తున్నారు.