- కాంగ్రెస్ అదే కోరుకుంటోంది
- రాజ్యసభ ఎంపీ మల్లిఖార్జున ఖర్గే
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాలకు షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు సాధ్యమైనంత త్వరగా జరపాలని కాంగ్రెస్ కోరుకుంటోందని రాజ్యసభ ఎంపీ మల్లికార్జున ఖర్గే స్పష్టంచేశారు. ఎన్నికలను వాయిదా వేయాలా? వద్దా? అనే అంశంపై రాజకీయవర్గాల్లో తాజాగా జరుగుతున్న చర్చపై మంగళవారం ఆయన స్పందించారు. ఎన్నికలు జరపాలన్న వాదనకు మద్దతిచ్చారు. ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంట్సమావేశాలకు కూడా హాజరుకాకుండా స్వయంగా ర్యాలీల్లో పాల్గొంటూ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తూ పోతుంటే ఎన్నికలను మాత్రం ఎందుకు ఆపాలని ఖర్గే ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వమే స్వయంగా ఎన్నికలను సమర్థిస్తుందన్నారు. అలాంటప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరుపవచ్చని పేర్కొన్నారు. ఇదిలాఉండగా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, దేశంలో కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతుండటం, ఒమిక్రాన్ వేరియంట్ భయాల మధ్య ఎన్నికలు వాయిదా వేయాలనే అంశంపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు జరపాలని ఛత్తీస్‌గఢ్ ఆరోగ్యశాఖ మంత్రి టీఎస్ సింగ్ దేవ్ సోమవారం వ్యాఖ్యానించారు. దీనిని తాజాగా ఖర్గే సమర్థించారు. ఒమిక్రాన్ కారణంగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వాయిదాపడే అవకాశమే లేదని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. శాసనసభల పదవీకాలం ముగిసేలోపే ఎన్నికలు నిర్వహించాలన్న రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా షెడ్యూల్ను ప్రకటించనున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఐదు రాష్ట్రాల్లో కొవిడ్ పరిస్థితి గురించి ఎన్నికల సంఘం సోమవారం కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌భూషణ్‌తో కలిసి అంచనా వేసింది. ఎన్నికల సమయంలో కొవిడ్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలుచేయాల్సిన అవసరంపై చర్చించారు. ఈ రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని ఈసీ కోరింది. మరోవైపు ఎన్నికల నిర్వహణకు భద్రతా దళాల కేటాయింపుపై ఈసీ అధికారులు పారామిలటరీ దళాల అధినేతలతో చర్చించనున్నారు.