సారథి న్యూస్ : రుతుపవనాల ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే సాధారణం కంటే వర్షపాతం నమోదైంది. పలు చోట్ల వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా రాయలసీమలో ఈ సారి వర్షాల తీవ్రత అధికంగానే ఉంది. కాగా నేటి నుంచి అయిదు రోజుల పాటు తెలంగాణ, కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో ఈ రోజు, రేపు ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రెండు రోజులు దక్షిణ బంగాళాఖాతం, తర్వాత మధ్య బంగాళాఖాతంలో 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. ఈ క్రమంలో మత్స్యకారులు ఆ దిశగా వేటకు వెళ్లరాదని వాతవరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. కాగా తెలుగు రాష్ట్రాల్లో విత్తనాలు వేసే తెరపి కూడా ఇవ్వడం లేదు వానలు. నేల కాస్త ఆరిందని అన్నీ సిద్ధం చేసుకునేలోపే మళ్లీ జల్లులు పడుతున్నాయి. మరికొన్ని చోట్లు ఎడతెరపి లేని వర్షాల వల్ల కలుపు బాగా పెరిగి అన్నదాతలకు ప్రాణసంకటంగా మారింది.