ఆంధ్రప్రదేశ్‌లో పాలకపక్షమైన వైఎస్సార్ సీపీలో మరోసారి ధిక్కార స్వరం వినిపించింది. ఆ పార్టీకి చెందిన ఎంపీ వైఎస్సార్ సీపీ నిర్ణయాలకు వ్యతిరేకంగా టీడీపీకి అనుకూలంగా మాట్లాడారు. దీంతో పార్టీలో మరోసారి లుకలుకలు బయటపడ్డాయి. తరచూ పార్టీని, సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని విమర్శిస్తున్న ఆ పార్టీకి చెందిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి శుక్రవారం ఓ న్యూస్ చానల్‌లో మాట్లాడుతూ..తమ సొంత పార్టీ నిర్ణయాలపై విరుచుకుపడ్డారు. కేవలం ముగ్గురు ఎంపీలకు తప్ప మిగతా వారెవరికీ పార్టీ అధినేత, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని విమర్శలకు దిగారు. వైఎస్సార్ సీపీ ఎంపీలను బీజేపీలోకి తీసుకెళ్లాలన్న ఆలోచన తనకు లేదని తెలిపారు.
ఏపీలో టీడీపీకి చెందిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ జరిగిన తీరును కూడా ఆయన తప్పుబట్టారు. గోడ దూకి అచ్చెన్నను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. నిజంగా తప్పు చేస్తే చర్యలు తీసుకోవాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు రోజుకు ఒకరు అరెస్ట్ అవుతారని మంత్రులు అనడం సరికాదని చెప్పారు. ‘మంత్రుల వ్యాఖ్యలతో కావాలని చేసినట్లు ఉందని అనుకుంటారు. వైఎస్సార్సీపీ నేతల అత్యుత్సాహం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని వ్యాఖ్యానించారు. ఆధారం లేకుండా ఎవరూ కేసులు పెట్టలేరని, అయితే అచ్చెన్నను అరెస్ట్ చేసిన విధానం సరిగా లేదన్నారు. అచ్చెన్నను పరామర్శించడానికి చంద్రబాబును అనుమతించకపోవడం మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుందన్నారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు వైఎస్సార్సీపీ రంగుల విషయంలో కోర్టు తీర్పును అమలు చేయాల్సిందే.’ అని రఘురామకృష్ణంరాజు సూచించారు.
ఈ వ్యాఖ్యలు పూర్తిగా పార్టీకి నష్టం జరిగేలా ఉన్నాయని పార్టీ కార్యకర్తలు, నాయకులు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం కావాలనే తమను టార్గెట్ చేసిందని టీడీపీ విమర్శలకు దిగుతోంది. ఇలాంటి తరుణంలో అధికార పార్టీకి చెందిన ఎంపీ వారి పార్టీ విధానాలనే తూర్పారపడుతుండడం వైఎస్సార్సీపీ నేతలకు మింగుడు పడడం లేదు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఎంపీని పార్టీనుంచి బహిష్కరించాలన్న డిమాండ్ కార్యకర్తల్లో వినిపిస్తోంది. అయితే, పార్టీ అధినేత, జగన్‌మోహన్‌రెడ్డి దీనిపై ఇంకా మౌనంగానే ఉన్నారు. ఆయన ఏం చర్య తీసుకుంటారోనని పార్టీ కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు.