సారథిన్యూస్, హైదరాబాద్: తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, టీజేఏసీ చైర్మన్ కోదండరాం త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయనున్నాడు. అందుకోసం ఆయన విపక్షాల మద్దతు కూడగట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జనసమితి పోటీచేసినప్పటికీ ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. దీంతో తెలంగాణ యువత, నిరుద్యోగుల్లో కోదండరాం పట్ల సానుభూతి ఉన్నది. సోషల్‌మీడియాలో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉన్నది. ఈ క్రమంలో గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగితే కోదండరాం తేలిగ్గా గెలుస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు పార్టీలకతీతంగా స్పందిస్తుంటారు. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్వహించిన ఎన్నికల్లో ఆ పార్టీ దారుణంగా ఓడిపోయింది. పోటీచేసిన మూడుస్థానాల్లోనూ ఓటమి పాలయ్యంది. ప్రశ్నించే గొంతునవుతా అంటూ బరిలో నిలిచిన కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి గెలుపొందారు. ప్రస్తుతం అదేతరహాలో ప్రచారం చేస్తున్న కోదండరాం కూడా గెలుపొందవచ్చని విశ్లేషకుల భావన. నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఆయన మండలికి పోటీ చేస్తారని టాక్.
విపక్షాల ఏమేరకు సహకరిస్తాయి!
కోదండరాం పోటీచేసేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆయన విపక్షాల మద్దతు కూడగట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఆయన కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ పార్టీలకు లేఖలు రాశారట. వామపక్షాలు, టీడీపీ ఆయనకు మద్దతు ఇవ్వవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందా? లేదా అన్నది ప్రశ్నర్థకంగా మారింది. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ కోదండరాం లాంటివారు రాజకీయపార్టీలకు దూరంగా ఉండటమే మేలు.. మేధావులుగా ప్రజలమధ్యలో ఉంటేనే వారికి ఎంతో విలువ’ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో కోదండరామ్ ఎమ్మెల్సీ బరిలో నిలువడం కాంగ్రెస్ లోని ఓ వర్గానికి ఇష్టం లేదన్నది స్పష్టమవుతున్నది. అయితే కోదండరాం మాత్రం ఎలాగైనా ఎన్నికల బరిలో దిగాలని ఆలోచిస్తున్నారట.