Breaking News

నిజమైన గౌరవం దక్కింది


ఆయన సేవలకి నిజమైన గౌరవం దక్కింది. బాలీవుడ్ హీరో.. తెలుగు తెరపై విలన్.. సోనూసూద్. కరోనా భయంకర పరిస్థితుల్లో ఎవరూ ముందుకు రాని సిట్యుయేషన్ లో నిస్వార్థంతో లక్షల మంది వలస కార్మికులకు తన వంతు సాయాన్ని అందించి నిజమైన హీరో అనిపించుకున్నారు సోనూసూద్. తను ఇష్టపడి సాయం చేయడమే కాదు కష్టంలో ఉన్నాం ఆదుకోండి అన్న వారికి కూడా చేయూత నిచ్చారు. ఇప్పుడాయన సేవా నిరతికి ప్రతిష్టాత్మక ‘ఎస్డీజీ స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్’ అవార్డును ప్రకటించి సోనూ ను గౌరవించింది ఐక్యరాజ్యసమితి. యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ తరఫున ఈ అవార్డును సోమవారం (సెప్టెంబర్ 29న) ఆన్‌లైన్‌లో నిర్వహించిన వేడుక ద్వారా సోనూ సూద్‌కు అందజేసింది.

దీనికి ముందు ఈ అవార్డు గ్రహీతలు ఏంజెలినా జూలీ, డేవిడ్ బెక్‌హామ్, లీయోనార్డో డికాప్రియో, ఎమ్మా వాట్సన్, లియామ్ నీసన్, కేట్ బ్లాంకెట్, ఆంటోనియో బాండెరస్, నికోలెస్ కిడ్మన్, ప్రియాంక చోప్రా లు. ఇప్పుడు వీరి సరసన సోనూ సూద్ నిలిచారు. సినిమా, క్రీడలు తదితర రంగాలకు చెందిన వీరంతా పలు యూఎన్ బాడీస్ నుంచి ఇలాంటి గౌరవాన్నే పొందారు. ప్రపంచంలో పేదరికాన్ని నిర్మూలించాలని, భూగోళాన్ని రక్షించాలని పిలుపునిచ్చిన ఐక్యరాజ్య సమితి.. 2030 నాటికి ఈ భూమి మీద ఉన్న ప్రజలకు శాంతి, శ్రేయస్సు‌ను అందించడమే ధ్యేయంగా పెట్టుకుంది. దీనిలో భాగంగానే స్వార్థ రహిత సేవలో భాగం పంచుకునే వారిని ఈ అవార్డు తో సత్కరిస్తోంది. యూఎన్ అవార్డును పొందిన సోనూ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. ‘‘ఇది అరుదైన గౌరవం. యూఎన్ గుర్తింపు అనేది ఎంతో ప్రత్యేకం. ఏమీ ఆశించకుండా నా దేశ ప్రజలకు నాకు తోచినంత సాయం చేశాను. ఆ సేవలకు గుర్తింపు రావడం, అవార్డు తీసుకోవడం చాలా గొప్పగా అనిపిస్తోంది. 2030 నాటికి యూఎన్‌డీపీ తన రాయబారుల ద్వారా లక్ష్యాలను అందుకోవడానికి నా పూర్తి సహకారం అందిస్తాను. ఈ లక్ష్యాలను అమలులోకి తీసుకొస్తే ఈ భూమి, జీవికోటికే లాభం..’’అంటూ సోనూ సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.