Breaking News

నా పాట పంచామృతం..

ఆయన పాట నిజంగానే పంచామృతం.. అది భక్తి పాటైనా, డ్యూయెట్​ అయినా, విరహగీతమైనా, విషాధ పాటైనా ఆయన గాత్రంలోంచి వచ్చిందంటే ఓ ప్రత్యేకతను సంతరించుకుంటున్నది. తెలుగులో ఎందరో సుప్రసిద్ధ నేపథ్య గాయకులు ఉన్నప్పటికీ బాలూ గొంతు ప్రత్యేకం. ఏ హీరో నటించిన సినిమాలో ఆయన పాడితే.. అచ్చం హీరో తన గొంతులోంచి పాడినట్టే వినిపిస్తుంది. అంతటి నైపుణ్యం శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం సొంతం. ఇప్పడు ఆయన మనల్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడంటే ఎంతో బాధగా ఉన్నది. ఆయన స్వరం అజరామరం.. నిత్యం ఆయన తెలుగులోగిళ్లలో వినిపిస్తూనే ఉంటాడు. ఓ అమృతకంఠం మూగబోయినందుకు తెలుగునేల శోకిస్తున్నది. సినీప్రియులు, ఆయన అభిమానులు, శిష్యులు తీవ్ర బాధలో మునిగిపోయారు. కొన్ని కోట్లమందిని దశాబ్ధాలపాటు బాలూ తన గాత్రంతో అలరించారు.

బహుముఖ ప్రజ్ఞాశాలి

ఆయనలో ఒక్క గాయకుడు మాత్రమే లేడు.. ఓ సంగీతదర్శకుడు, నటుడు, నిర్మాత, డబ్బింగ్​ కళాకారుడూ ఉన్నారు. ఏ రంగంలోకి వెళ్లినా రాణించారు. వెండితెర మీదనే కాకుండా బుల్లితెర మీద కూడా బాలు తనదైన ముద్ర వేశారు. పాడుతా తీయగా వంటి కార్యక్రమాలను నిర్వహించి ఎంతో మంది గాయనీగాయకులను ప్రోత్సహించారు.

భారతదేశ ప్రభుత్వం నుంచి ఎస్పీబీ 2001లో పద్మశ్రీ పురస్కారాన్ని, 2011లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 25 సార్లు వివిధ విభాగాల్లో నంది పురస్కారాలను దక్కించుకున్నారు. అలాగే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నారు. 2016 నవంబరులో గోవాలో జరిగిన 47వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో ఎస్పీబీ శతవసంత భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ పురస్కారం (సెంటినరీ అవార్డ్‌ ఫర్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ 2016) అందుకున్నారు.