Breaking News

ఎన్డీఏలో చేరండి.. జగన్​కు ప్రధాని ఆఫర్​!

ఎన్డీఏలో చేరాలని ఏపీ జగన్​ను ప్రధాని మోదీ ఆహ్వానించారా? ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏలో భాగస్వాములుగా మారి వైఎస్సార్​సీపీ కి చెందిన ఇందరు ఎంపీలకు మంత్రి పదవులు తీసుకోవాలని మోదీ ఒత్తిడి తెస్తున్నారా? అంటే ఢిల్లీ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తున్నది. సీఎం జగన్​ ఢిల్లీ వెళ్లాక జాతీయ మీడియాలో పలు ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే ప్రత్యక్షంగా పరోక్షంగా బీజేపీకి మద్దతు ఇస్తున్న వైఎస్సార్​సీపీ త్వరలోనే ఎన్డీఏలో చేరబోతున్నదంటూ వార్తలు వస్తున్నాయి. రెండు వారాల క్రితమే సీఎం జగన్​.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్​ తాజా పర్యటనతో పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మంగళవారం దాదాపు 40 నిమిషాలపాటు ప్రధాని మోదీ, సీఎం జగన్ వివిధ అంశాలపై చర్చించినట్టు సమాచారం. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధులపైనే సీఎం జగన్ ప్రధానితో చర్చించారని వైసీపీ వర్గాలు చెబుతున్నప్పటికీ.. భేటీలో చర్చకు వచ్చిన అసలు అంశాలు మాత్రం వేరే ఉన్నాయనే టాక్ మాత్రం బలంగా వినిపిస్తోంది.
ఇప్పటికే శివసేన, అకాళీదల్​ ఎన్డీఏకు దూరమయ్యాయి. దీంతో తమ కూటమిలోకి కొత్త మిత్రులను తీసుకురావాలని బీజేపీ నాయకత్వం నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ప్రత్యేకహోదా విషయంలో కేంద్రం వైఖరి తెలిసి కూడా ఇప్పుడు పొత్తుపెట్టుకుంటే విమర్శలు వచ్చే అవకాశం ఉన్నదని వైఎస్సార్​సీపీ అధినాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం. అయితే ఎన్డీఏలో చేరడం మినహా.. కేంద్రంలోని బీజేపీ సర్కార్​కు తాము అన్ని విధాలా సహకరిస్తామని జగన్​ మోదీకి విన్నవించినట్టు కొన్ని ఇంగ్లీష్​ సైట్లలో వార్తలు వెలువడ్డాయి.