సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో మేడ్చల్–మల్కాజ్ గిరి జిల్లాలోని కాప్రామండలం కుషాయిగూడ, మల్కాజ్గిరి మండలం నేరెడ్ మెట్, ఉప్పల్ మండలంలోని రామాంతాపూర్ ప్రాంతాలను కంటైన్ మెంట్ జోన్లుగా ప్రకటించారు. జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు బుధవారం ఈ ప్రాంతంలో పర్యటించి పరిస్థితిని ఆరాతీశారు.
పాజిటివ్ వచ్చిన వారిని గాంధీ ఆస్పత్రికి తరలించామని చెప్పారు. ప్రజలు బయటికి రాకుండా బారికేడ్లను ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. మెడికల్, పోలీస్, రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా వచ్చిన ప్రాంతాల్లో బ్లీచింగ్, హైడ్రోక్లోరిన్ చల్లి శుభ్రంగా ఉంచాలన్నారు.
ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ విద్యాసాగర్, కీసర ఆర్డీవో రవి, మల్కాజిగిరి ఆర్డీవో మల్లయ్య, కాప్రా తహసీల్దార్ గౌతమ్ కుమార్, మల్కాజిగిరి తహసీల్దార్ గీత, డీఎంహెచ్ వో వీరాంజనేయులు ఉన్నారు.