- తెలుగు రాష్ట్రాల నుంచి పలువురికి టాప్ ర్యాంక్‌లు
- పాలమూరు బిడ్డకు 272వ ర్యాంకు,
- 135వ ర్యాంక్ సాధించిన కర్నూలు యువకుడు
- కానిస్టేబుల్ కుమారుడికి 516వ ర్యాంకు
సారథి న్యూస్, నారాయణపేట, కర్నూలు, పెద్దశంకరంపేట: యూపీఎస్సీ నిర్వహించిన 2019 సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో తెలుగు తేజాలు విశేషప్రతిభ చూపారు. ఆలిండియా స్థాయిలో ఉత్తమ ర్యాంకులతో తాము ఆశించిన గోల్సాధించారు. ఐఏఎస్‌గా ఎంపికై తల్లిదండ్రుల కలలను సాకారం చేశారు. కరీంనగర్ ఎన్సీసీ తొమ్మిదో బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ అజయ్ కుమార్ కూతురు ఐశ్వర్య తొలి ప్రయత్నంలోనే ఆలిండియా 93వ ర్యాంకు సాధించింది. అలాగే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేటకు చెందిన బి.రాహుల్ 272 ఆలిండియా ర్యాంకుతో సివిల్స్ కు ఎంపికయ్యాడు. జిల్లా ఎస్పీ డాక్టర్ చేతన అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. ఇంటర్వ్యూలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎస్పీ ఇచ్చిన సలహాలు, సూచనలు తనకు ఎంతగానో ఉపయోగపడ్డాయని తెలిపారు. అందుకు ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కర్నూలుకు చెందిన కులదీప్‌కు 135వ ర్యాంక్
కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీ మున్సిపల్ హైస్కూల్ ఎస్జీటీ టీచర్ రాజరాజేశ్వరి, కల్లూర్ జడ్పీ హై స్కూల్ లో ఫిజికల్ డైరెక్టర్ గా పనిచేస్తున్న విశ్వేశ్వరయ్య కుమారుడు జంగం కులదీప్ మంగళవారం విడుదలైన సివిల్స్ మెయిన్స్ లో 135వ ర్యాంక్ సాధించాడు. ఈ మేరకు కులదీప్ తల్లిదండ్రులను మంగళవారం నగర్ పాలక సంస్థ ఆఫీసులోని కమిషనర్ చాంబర్ లో కమిషనర్ డీకే బాలాజీ ఘనంగా సన్మానించారు. గతంలో ఐపీఎస్ స్థాయి ర్యాంకు సాధించిన కులదీప్ ప్రస్తుతం గుజరాత్ లోని అహ్మదాబాద్ లో శిక్షణ పొందాడు. ఐఏఎస్ కావాలన్న పట్టుదలతో తిరిగి 2019 సివిల్స్ మెయిన్స్ రాసి 135వ ర్యాంక్ ను సాధించారు. ఓ మున్సిపల్టీచర్ కుమారుడు ఐఏఎస్ సాధించడంపై కమిషనర్ వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ పీవీ రామలింగేశ్వర్ ఉన్నారు.
కానిస్టేబుల్ కుమారుడికి 516వ ర్యాంక్
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ స్పెషల్ బ్రాంచ్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ శ్రీనివాస్ కుమారుడు డి.వినయ్ కాంత్ ఆలిండియా సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో 516వ ర్యాంకు సాధించాడు. పోలీస్ కమిషనర్ జోయల్‌డేవిస్ కానిస్టేబుల్ శ్రీనివాస్ ను ప్రత్యేకంగా అభినందించారు. పిల్లలకు ఏ రంగంలో ప్రావీణ్యత ఉంటుందో అదే రంగంలో ప్రోత్సహించాలని సూచించారు.
గిరిపుత్రుడికి 764వ ర్యాంక్
సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన శశికాంత్ నాయక్ 764వ ర్యాంకు సాధించాడు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం పంచాయతీ చాకలిదాని తండాకు చెందిన రాములు నాయక్, సీతమ్మ దంపతుల పెద్ద కుమారుడు శశికాంత్. తండ్రి చనిపోయాడు. ప్రస్తుతం షాద్‌నగర్‌లోని టీచర్స్ కాలనీలో స్దిరపడ్డారు. హైదరాబాద్‌లోని విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ (ఈఈఈ) పూర్తిచేశాడు. 2012లో సివిల్స్ వైపు దృష్టిపెట్టాడు. ఢిల్లీకి వెళ్లి అక్కడే కోచింగ్ తీసుకుని జాతీయ స్థాయిలో 764వ ర్యాంక్ సాధించాడు. ఆయనను ఐఆర్టీఎస్ (ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్)కు కేటాయించారు.