సారథి న్యూస్, హైదరాబాద్: వస్త్రవ్యాపారంపై కరోనా పంజా విసిరింది. ఆ రంగం మీద ఆధారపడి జీవించే వ్యాపారులు, వర్తకులు ఆర్థికంగా చితికిపోతున్నారు. ప్రస్తుతం అమ్మకాలు లేక హోల్‌సేల్, రిటైల్ షాపులు వెలవెలబోతున్నాయి. అరకొరగా వచ్చే వినియోగదారుల నుంచి ఎక్కడ కరోనా అంటుకుందేమోనన్న భయంతో బిక్కు బిక్కుమంటూ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఎంతటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నా ఆ మహమ్మారి ఎక్కడి నుంచి వస్తుందోనన్న ఆందోళనతో కొద్ది రోజులపాటు స్వచ్ఛందంగా లాక్‌డౌన్లు ప్రకటించి, వారం తర్వాత మళ్లీ దుకాణాలను తెరుస్తున్నారు. ఇలా.. కరోనా దెబ్బతో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా తాము నష్టపోతున్నామని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షాపుల్లో తమ బతుకు దినదిన గండం.. నూరేండ్ల ఆయుష్షులా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దిక్కుతోచనిస్థితిలో యజమానులు
ఏటా మార్చి నుంచి మే వరకు రాష్ట్రంలో పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుంది. ఈ కాలంలో వస్త్ర దుకాణాలు అమ్మకాలతో కళకళలాడుతుం టాయి. ఏడాదిలోని 9 నెలల్లో 50శాతం అమ్మకాలు కొనసాగడం ఒక ఎత్తయితే కేవలం మార్చి, ఏప్రిల్, మే నెలల్లోనే మిగతా 50శాతం అమ్మకాలు జరగడం మరో ఎత్తు. దీన్నిబట్టే ఆ మూణ్నెళ్ల కాలం ఆ రంగానికి ఎంత విలువైందో అర్థమవుతోంది. కానీ కరోనా దెబ్బతో ఈ ఏడాది పెండిండ్ల సీజన్ కళ తప్పింది. కరోనా వ్యాప్తి, దశలవారీ లాక్‌డౌన్ నేపథ్యంలో వివాహాలు ఆగిపోయాయి. ఒకవేళ జరిగినా పరిమితంగానే. దీంతో హైదరాబాద్‌లోని సుల్తాన్ బజార్, బేగం బజార్, సికింద్రాబాద్‌లోని జనరల్ బజార్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం హోల్‌సేల్, రిటైల్ వస్త్ర దుకాణాలను మూసివేశారు. ఫలితంగా తెలంగాణలోని మొత్తం 30 వేల (చిన్నవి, మధ్య తరహావి, పెద్దవన్నీ కలిపి) షాపుల ఉన్నాయి.
సరుకు పందికొక్కుల పాలు
దిక్కుతోచనిస్థితిలో మళ్లీ షాపులు తెరిచినా..వ్యాపారాలు మాత్రం పుంజుకోవడం లేదు. దీంతో ఏటా పెండిండ్ల సీజన్‌లో రూ.ఐదువేల కోట్ల నుంచి రూ.ఎనిమిది వేల కోట్ల దాకా కొనసాగే క్రయవిక్రయాలు.. ఈసారి భారీగా పడిపోయాయి. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి రూ.500 కోట్ల వ్యాపారం కూడా జరగలేదని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు వివరించారు. దీన్నిబట్టి ఆ రంగం ఎంతగా కుదేలైందో అర్థం చేసుకోవచ్చు. పెళ్లిళ్ల సీజన్ కోసమని తీసుకొచ్చి నిల్వఉంచిన (స్టాక్) వస్త్రాలు.. రెండున్నర నెలలపాటు షాపులు తీయకపోవడంతో కొంత దెబ్బతిన్నాయని హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి వాపోయాడు. జిల్లా కేంద్రాలు, మున్సిపల్ పట్టణాల్లోని దుకాణాల్లో ఎలుకలు, పంది కొక్కులు చేరడంతో చాలానష్టం వాటిల్లిందని ఆయన చెప్పారు. ఇలా కరోనా వల్ల ఒకవైపు అమ్మకాల్లేకపోవటం, మరోవైపు షాపుల అద్దెలు, కరెంట్బిల్లులు, గుమస్తాలు, సిబ్బందికి జీతాలు చెల్లించాల్సి రావడంతో తాము ఆర్థికంగా చితికిపోతున్నామని వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు.
మరో ఆర్నెళ్లు తప్పదు
రాష్ట్రంలో వస్త్ర వ్యాపార రంగం మునుపటి మాదిరిగా పుంజుకోవడానికి ఆర్నెళ్ల నుంచి ఏడాది సమయం పడుతుందని ఆ రంగానికి చెందిన నిపుణులు అంచనా వేస్తున్నారు. వివాహాల సీజన్ మొత్తం తుడిచి పెట్టుకుపోవడంతో వ్యాపారులు ఆర్థికంగా దివాళా తీస్తున్నారు. పెట్టుబడులు, వాటికి వడ్డీలు తడిసి మోపెడవుతున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్లు కొద్దో గొప్పో జరుగుతున్నప్పటికీ పరిమిత సంఖ్యలోనే బంధువులు, స్నేహితులను ఆహ్వానించాలనే నిబంధన ఉండడంతో వినియోగదారులు వధూవరుల వరకే వస్త్రాలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో లాక్‌డౌన్ తర్వాత షాపులు తెరిచినప్పటికీ తమకు పెద్దగా ఉపయోగం లేకుండా పోయిందని వ్యాపారులు చెబుతున్నారు.