సారథి న్యూస్, వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రెండు వరి కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ జి.సైదులు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం ప్రభుత్వ ధ్యేయమన్నారు.
నాణ్యమైన పంటను తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. అకాలవర్షాలు కురుస్తున్న వేళ ధాన్యం నష్టపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. టార్ఫలిన్ కవర్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. వరి ధాన్యంలో తేమశాతం 14 కు మించి ఉండకూడదని అవగాహన కల్పించారు.
అగ్రికల్చర్, సహకార సొసైటీ అధికారులు రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇవ్వాలని ఆదేశించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సామాజిక దూరం పాటిస్తూనే.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.