డివిలియర్స్.. వచ్చేయ్ అన్నారు!
రెండేళ్ల క్రితం ఇంటర్ నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సౌతాఫ్రికా సూపర్ స్టార్ ఏబీ డివిలియర్స్ ను తిరిగి జట్టులోకి రప్పించేందుకు క్రికెట్ సౌతాఫ్రికా(సీఎస్ఏ) అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఒక దశలో జట్టుకు మళ్లీ కెప్టెన్సీ చేపట్టమని కూడా ఆఫర్ ఇచ్చింది. ఈ విషయాన్ని ఏబీనే వెల్లడించాడు. అయితే, తాను పూర్తిస్థాయి ఫామ్‌లో ఉంటేనే తిరిగి జట్టులోకి వస్తానని చెప్పాడు. ‘సౌతాఫ్రికాకు ఆడాలన్న కోరిన నాలో ఉంది.
ప్రొటీస్ టీమ్‌ను లీడ్ చేయాలని కూడా బోర్డు నన్ను కోరింది. అయితే, నేషనల్ టీమ్‌లోకి తిరిగి రావాలంటే నేను టాప్ ఫామ్‌లోకి రావడం నా వరకు చాలా ముఖ్యమైన విషయం. నా తర్వాతి ప్లేయర్ కంటే నేను మెరుగ్గా ఉండాల్సిందే. మా జట్టులో చోటుకు నేను అర్హుడిని అని నాకు అనిపిస్తేనే… ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండాలని కూడా కోరుకుంటా.
ప్రొటీస్ టీమ్‌కు చాలా కాలంగా దూరంగా ఉంటున్నా. అందువల్ల జట్టులో ప్లేస్ కోరుకునే సత్తా ఇప్పటికీ నాలో ఉందని నాతో పాటు ఇతరులు కూడా భావించడం ముఖ్యం. అయితే ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా ఆట ఆగిపోయింది. మళ్లీ ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. ఒకవేళ మొదలైతే అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటా’ అని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.