టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటికి అధికారులు నోటీసులు జారీచేశారు. ఏపీలోని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి పరిధిలో చంద్రబాబు అద్దె ఇంట్లో ఉంటున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కృష్ణానదికి వరద భారీగా వస్తుండటంతో చంద్రబాబు ఈ ఇంటిని వెంటనే ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు జారీచేశారు. కొంతకాలంగా ఏపీలో వర్షాలు జోరుగా కురుస్తున్న విషయం తెలిసిందే. వర్షాల దాటికి వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి.
ప్రస్తుతం బ్యారేజీ వద్ద 16.2 అడుగులకు నీటిమట్టం చేరింది. ఇన్ ఫ్లో 6.66 లక్షలు క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 6.61 లక్షల క్యూసెక్కులుగా ఉంది. భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో కృష్ణా నది వరద ప్రవాహంతో లోతట్టు ప్రాంతాలు ముంపుకి గురైయ్యాయి. కృష్ణలంక తారకరామనగర్ భూపేష్ గుప్తానగర్లో ఇళ్లు నీట మునిగాయి. దీనితో విజయవాడ నగరంలో నాలుగు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ముంపు గ్రామాల వాసులని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత చంద్రబాబుకు అధికారులు నోటీసులు జారీచేశారు. చంద్రబాబు ఇంటితో పాటూ కరకట్టపై ఉన్న ఇతర నివాసాలకు కూడా నోటీసులు ఇచ్చారు. వరద పెరుగుతుండటంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. అయితే ఈ విషయంపై చంద్రబాబు టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.. గతంలో కూడా ఓ సారి జగన్ ప్రభుత్వం నోటీసులు ఇవ్వగా టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. కావాలనే ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తకుండా వరద పెరిగేలా చేశారని ఆరోపించారు.