లఢక్ : వాస్తవాధీన రేఖ (ఎల్ఎసీ) వెంబడి ఉద్రిక్త వాతావరణం నెలకొందని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె అన్నారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఆయన లఢక్ లో పర్యటిస్తున్నారు. ఎల్ఎసీ లోని పాంగాంగ్ సో సరస్సు వద్ద చైనా బలగాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో నరవణె పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను లేహ్ లోని పలు ప్రాంతాల్లో పర్యటించాను. కొంతమంది అధికారులతో మాట్లాడాను. ఎల్ఎసీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే జవాన్లు మాత్రం సర్వసన్నద్ధంగా ఉన్నారు. ఎలాంటి పరిస్థితులెదురైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం’ అని తెలిపారు. కాగా, ప్రస్తుతానికి ఇరు దేశాల అధికారులు చర్చలు సాగిస్తున్నారని, ఎటువంటి విబేధాలు ఉన్నా చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని నరవణె సూచించారు.