- రైతు అంశాలపై ప్రధాని మోడీ నిర్లక్ష్యం
- మద్దతు ధరలు, పరిహారం విషయంలో స్పందనలేదు
- పార్టీ పార్లమెంటరీ సమావేశంలో సోనియా ఆగ్రహం
న్యూఢిల్లీ: రైతుల అంశాలపై ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తప్పుబట్టారు. రైతు సమస్యలు, సామాన్య ప్రజల విషయంలో ఎలాంటి స్పందన లేని రీతిలో కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కనీస మద్దతు ధరకు (ఎంఎస్‌పీ) చట్టపరమైన హామీ, మరణించిన రైతులకు పరిహారం ఇవ్వాలని రైతులు చేస్తున్న డిమాండ్‌కు కాంగ్రెస్ బాసటగా నిలుస్తుందని చెప్పారు. వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై పార్లమెంట్లో చర్చకు తమ పార్టీ పట్టుబడుతోందని తెలిపారు. బుధవారం జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సోనియాగాంధీ మాట్లాడుతూ.. మూడు సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఏడాది పాటు సాగించిన నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన రైతుల త్యాగాలను గుర్తించాలని ఎంపీలను కోరారు. 700 మంది త్యాగాలను గౌరవిద్దామని పిలుపునిచ్చారు. రైతులు, సామాన్య ప్రజానీకం సమస్యలపై మోడీ ప్రభుత్వం ఎలాంటి స్పందన లేకుండా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాజ్యసభ నుంచి 12 మంది ఎంపీలను సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం అనుచితమైన చర్యగా అభివర్ణించారు. రాజ్యాంగ నిబంధలను ఇది పూర్తిగా విరుద్ధమన్నారు. నాగాలాండ్‌లో సైన్యం కాల్పుల్లో అమాయక పౌరులు మరణించిన ఘటనపై ఘాటుగా స్పందించారు. ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అంతకుముందు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. రైతుల ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నష్టపరిహారం కానీ, ఉద్యోగాలు కానీ ఇవ్వకపోవడం, కేసులు ఉపసంహరించకపోవడం చాలా పెద్ద తప్పిదాలన్నారు. రైతు నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన రైతుల జాబితాను కూడా లోక్‌సభకు రాహుల్ సమర్పించారు.