సారథి న్యూస్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల మాదిరిగానే వేములవాడ నియోజవర్గాన్ని అదే తరహాలో అభివృద్ధి చేస్తానని, ఈ రెండు నియోజకవర్గాలను తనకు రెండు కళ్లుగా భావిస్తానని మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. మిడ్ మానేరు ప్రాజెక్టు యువతకు మినీ డెయిరీలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అందించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. సోమవారం రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతనగర్ లో సకల వసతులతో ప్రారంభించిన జడ్పీ హైస్కూలు ఆయన ప్రారంభించారు. పదవులు రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలని, ప్రజాసంక్షేమం కోసం నిరంతరం కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఆనాడు చింతమడక నుంచి సైకిల్ పై సీఎం కె.చంద్రశేఖర్ రావు కొనరావుపేట, మరిమడ్లకు వచ్చేవారని గుర్తుచేశారు. రూ.3.కోట్లతో అభివృద్ధి చేసిన ప్రభుత్వ స్కూలులో వెయ్యి మంది విద్యార్థులకు సరిపడా 33 గదులను నిర్మించారు. అత్యధికమైన గ్రంథాలయం, ఆధునిక టాయిలెట్స్, సురక్షిత తాగునీరు, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్ ను ఏర్పాటుచేశారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్, కలెక్టర్ కృష్ణభాస్కర్, డీఈవో, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్‌కు అభినందనలు
తెలంగాణ రాష్ట్రం రావడంతోనే కోనరావుపేట మండలంలో మల్కపేట రిజర్వాయర్ అయిందని, దేశంలోనే ఎక్కడాలేని విధంగా రైతుబంధు, రైతుబీమాను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని మంత్రి కె.తారక రామారావు అన్నారు. జిల్లాలో ఎక్కడ చూసినా చెరువులు, కుంటలు నిండి ఉన్నాయని తెలిపారు. దేశంలోనే అత్యధికంగా రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఆరు మీటర్ల మేర భూగర్భజలాలు పెరిగాయని వివరించారు. అభివృద్ధి పథకాలను విజయవంతంగా అమలుచేస్తున్న రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ కు అభినందనలు తెలిపారు.