- ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్
- నేడు, రేపు ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ ధర్నా
సామాజిక సారథి, హైదరాబాద్: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనకుండా రాష్ట్రంలో సీఎం కేసీఆర్, కేంద్రంలో ప్రధాని మోడీ దొంగ నాటకాలు ఆడుతూ, అన్నదాతల జీవితాలతో చెలగాటమాడుతున్నారని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి జూమ్ ద్వారా మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఐదుకోట్ల టన్నుల బియ్యాన్ని సేకరించాలనే లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ నుంచి 40 లక్షల టన్నుల బియ్యం మాత్రమే సేకరిస్తామని చెప్పిందన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం తీరు అధ్వానంగా ఉందని విమర్శించారు. ఉప్పుడు బియ్యం పేరుతో రైతులను ఇబ్బంది ఇపెట్టకుండా రా రైస్ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. కేసీఆర్ తీరుతో అన్నదాతలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని అవేదన వ్యక్తం చేశారు. నెల రోజులుగా ధాన్యాన్ని రోడ్లమీద, కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో పోసిన ధాన్యం తడిసి మొలకలు వస్తున్నా కొనకపోవడం రైతుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేస్తుందన్నారు. యాసంగిలో వరి వేయొద్దని ప్రభుత్వం చెప్పడం దుర్మార్గమని, మరి రైతులు ఏ పంటలు వేయాలని ప్రశ్నించారు. అనంతరం టీపీసీసీ అధికార ప్రతినిధి అయోధ్యరెడ్డి మాట్లాడుతూ వడ్ల కుప్పల మీదే రైతులు ప్రాణాలు వదులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి గింజనూ కొనాలనే డిమాండ్‌తో శని, ఆదివారాల్లో ఇందిరాపార్క్ వద్ద దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు.