- కొనమని వేడుకున్నా అధికారులు పట్టించుకుంటలేరు
- రేపటిలోగా కొనపోతే కుప్పపోసి అంటుపెడ్తం
- మంత్రి హరీశ్‌రావు ఎదుట అన్నదాతల గగ్గోలు
సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: ‘నెలరోజులుగా వరి కొనుగోలు కేంద్రం వద్ద పడిగాపులు గాస్తున్నాం. మా పంటను కొనుగోలు చేయమని వేడుకున్నా అధికారులు స్పందించడం లేదు’ అని రైతులు మంత్రి హరీశ్‌రావు ఎదుట గోడును వెళ్లబోసుకున్నారు. వడ్లను రైస్ మిల్లు యాజమాన్యాలు కూడా కొనుగోలు చేయడం లేదని ఆయన దృష్టికి తెచ్చారు. తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఒక్కసారి కూడా కేంద్రాలకు రాలేరని ఆయన ముందే తమ ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. నెలరోజులుగా వరి ధాన్యం కొనుగోలు కోసం ఎదురుచూసి విసిగివేసారిన అల్లాదుర్గం రైతులు మంగళవారం 161వ నెంబర్జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. సీఎం కేసీఆర్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపై వరి ధాన్యాన్ని పోసి నిప్పంటించారు. రైతుల నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. తమ పంట కొనేంత వరకు ధర్నా విరమింపబోమని అన్నదాతలు భీష్మించారు. దీంతో పోలీసులు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అదే సమయంలో నారాయణఖేడ్ లో పర్యటన ముగించుకుని వస్తున్న ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు కాన్వాయ్ ట్రాఫిక్ లో చిక్కుకొని వెనుదిరిగే ప్రయత్నం జరిగింది. అయితే, మంత్రి హరీశ్‌రావు కారు దిగి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడి రైతుల వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని మంత్రి ఆదేశాలు జారీచేశారు. స్థానిక అధికారుల తీరుపై మంత్రి హరీశ్‌రావు అసహనం వ్యక్తం చేశారు. ఆయన సమాధానంతో శాంతించిన రైతులు రేపటిలోగా వరిధాన్యం కొనుగోళ్లు చేపట్టకపోతే పండించిన వరి ధాన్యాన్ని జాతీయ కుప్పలుగా పోసి తగలబెట్టి ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేస్తామని హెచ్చరించారు.
మంత్రి హరీశ్‌రావు సుడిగాలి పర్యటన
మంత్రి టి.హరీశ్‌రావు మంగళవారం జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. నారాయణఖేడ్ లో ఆధునిక వసతులతో ఏర్పాటుచేసిన ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. రోగులకు వైద్యం అందుతున్న తీరును పరిశీలించి డాక్టర్లకు సూచనలు చేశారు. అనంతరం జోగిపేట చేరుకున్న మంత్రి నేరుగా ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు వెళ్లి అక్కడ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. సమావేశంలోకి పార్టీ నాయకులు, కార్యకర్తలను ఇతరులను మీడియా ప్రతినిధులను అనుమతించలేదు. మెదక్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందున స్థానిక సంస్థల ప్రతినిధులతో భేటీ కావడానికే మంత్రి హరీశ్‌రావు మంగళవారం సుడిగాలి పర్యటన చేసినట్లు తెలుస్తోంది.
బీజేపీకి నైతిక హక్కు లేదు
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న తీరు బాగా లేదని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత బీజేపీ నాయకులకు లేదన్నారు. నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రిలో తనిఖీచేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ నేత జి.కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వస్తున్నప్పటికీ ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి లేకపోతున్నారన్నారు. సంగారెడ్డి జిల్లాలో 157 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి ఇప్పటికే అనేక చోట్ల పూర్తిస్థాయిలో రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేశామని పేర్కొన్నారు. తడిసిన ధాన్యం విషయాన్ని కూడా కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసే స్పందన లేదని ఆయన దుయ్యబట్టారు. తడిసిన ధాన్యంతోనే బాయిల్డ్ రైస్ తయారవుతుందని, ఈ వడ్లను కొంటే రైతులకు కూడా ఉపయోగకరంగానూ ఉంటుందన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పదే పదే టీఆర్ఎస్ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.