- ఐదురాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు
- 7 దశల్లో పోలింగ్.. జనవరి 14న నోటిఫికేషన్
- ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం
- వర్చువల్ ప్రచారానికి ప్రాధాన్యం
- కొవిడ్ ఎఫెక్ట్.. ఆన్‌లైన్‌లోనూ నామినేషన్లు
- ఎన్నికల సిబ్బందికి బూస్టర్డోస్వ్యాక్సిన్
- – అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్
ముఖ్యమైన తేదీలు
- నోటిఫికేషన్: జనవరి 14
- పోలింగ్: ఫిబ్రవరి 10 – మార్చి 7
- ఫలితాలు: మార్చి
- 10రాష్ట్రం : స్థానాలు
- ఉత్తరప్రదేశ్ : 403
- పంజాబ్ : 117
- ఉత్తరాఖండ్ : 70
- గోవా : 40
- మణిపూర్ : 60
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగగారా మోగింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ శాసనసభ ఎన్నికల షెడ్యూలును ఎన్నికల కమిషన్ వెలువరించింది. కరోనా విజృంభిస్తున్నా.. తగిన జాగ్రత్తలతో ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం ఏడు దశల్లో ఈ ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించింది. శుక్రవారం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) సుశీల్ చంద్ర మీడియాతో మాట్లాడారు. ఐదురాష్ట్రాల్లోని ఎన్నికలను మొత్తం ఏడు దశల్లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. జనవరి14న యూపీలో తొలిదశ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. తొలిదశ పోలింగ్ తేదీ ఫిబ్రవరి 10, రెండోదశ పోలింగ్ ఫిబ్రవరి 14న విడుదల కానుంది. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ లో ఒకే దశలో ఎన్నికలు నిర్వహిస్తారు. మూడో దశ పోలింగ్‌ను ఫిబ్రవరి 20న, నాలుగో దశ పోలింగ్‌ను పిబ్రవరి 23న, ఐదో తేదీ పోలింగ్‌ను ఫిబ్రవరి 27న, ఆరోదశ పోలింగ్‌ను మార్చి 3న, ఏడోదశ పోలింగ్‌ను మార్చి 7న ఎన్నికలు నిర్వహిస్తామని సీఈసీ వెల్లడించారు. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7వ తేదీవరకు ఏడు దశల్లో పోలింగ్ నిర్వహిస్తామని, మార్చి 10న ఏడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తామని సీఈసీ వివరించారు. ఉత్తరప్రదేశ్‌లో 403, ఉత్తరాఖండ్‌లో 70, పంజాబ్‌లో 117, గోవాలో 40, మణిపూర్‌లో 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
కొవిడ్ వ్యాప్తి.. పకడ్బందీ చర్యలు
ప్రస్తుతం పంజాబ్ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాలే ఉన్నాయి. పంజాబ్‌లో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఉంది. ఈ ఐదు రాష్ట్రాల్లో మొత్తం 18.34 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అందులో 24.5 లక్షల కొత్త ఓటర్లు నమోదు చేసుకున్నారని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర వివరించారు. ఇందులో అధికశాతం మహిళా ఓటర్లే ఉన్నారని తెలిపారు. అందుకు అనుగుణంగా 2,15,368 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్‌లో అభ్యర్థులు రూ.40 లక్షల ఎన్నికల వ్యయం అయ్యేందుకు అవకాశం ఉందన్నారు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించామన్నారు. గోవా, మణిపూర్ లో అభ్యర్థులు రూ.28 లక్షల ఎన్నికల వ్యయాన్ని నిర్ణయించామన్నారు. కొవిడ్ సోకిన వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు అనుమితించామని వెల్లడించారు. కొవిడ్ వల్ల పోలింగ్ స్టేషన్లన్లకు ఓటర్ల సంఖ్యను తగ్గించామని తెలిపారు. ఐదు రాష్ట్రాల్లో 900 మంది ఎన్నికల పరిశీలకులను నియమించామన్నారు. డబుల్ డోస్ వ్యాక్సిన్లు తీసుకున్న వారికే ఎన్నికల డ్యూటీ వేస్తున్నామని చెప్పారు. కొవిడ్ వల్ల ఎన్నికల సమయాన్ని ఓ గంట పొడిగిస్తున్నామని తెలిపారు. ఎన్నికల ఫలితాల తర్వాత విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదన్నారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి వెంట ఇద్దరికి మాత్రమే అనుమతించామన్నారు. ఇందులో భాగంగా జనవరి 15 వరకు రోడ్డు షోలకు అనుమతి లేదన్నారు. ఎన్నికల అధికారులకు కొవిడ్ బూస్టర్ డోస్ ఇస్తున్నామని తెలిపారు. ఎన్నికల వర్కర్లను ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా గుర్తించామన్నారు. కొవిడ్ వల్ల ఎన్నికల నిర్వహణ భారీ సవాల్‌గా మారిందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర తెలిపారు. ఇకపోతే ఆరుశాతం పోలింగ్ కేంద్రాలను పెంచుతున్నట్లు చెప్పారు. మొత్తం పోలింగ్ బూత్‌ల సంఖ్య 2.16 లక్షలు ఉందన్నారు. ఒక్కో పోలింగ్ బూత్‌కు ఓటర్ల సంఖ్యను 1,250కి తగ్గించినట్లు చెప్పారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో కూడా నామినేషన్లను దాఖలు చేయవచ్చునని తెలిపారు. కొవిడ్ పాజిటివ్ ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఓటు వేయొచ్చని తెలిపారు. అభ్యర్థులపై నమోదైన క్రిమినల్ కేసులను తప్పనిసరిగా టీవీ ఛానళ్లు, పత్రికల్లో బహిర్గతం చేయాలని సూచించారు.