- వరంగల్ కలెక్టర్ బి.గోపి
సామాజిక సారథి, వరంగల్: లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే చట్టరీత్యా నేరమని, ఎవరైనా ప్రయత్నిస్తే జరిమానాతో పాటు మూడేళ్ల పాటు జైలుశిక్ష పడుతుందని వరంగల్ కలెక్టర్ బి.గోపి సూచించారు. పీసీపీఎన్డీటీ పైన జిల్లా కలెక్టర్, మెజిస్ట్రేట్ అధ్యక్షతన శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గర్భస్థ పిండ పరీక్షలు చేసే సెంటర్ల యజమానులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ప్రజలకు తెలిస్తే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 104 ఫోన్ చేసి చెప్పాలని కలెక్టర్ కోరారు. సమాచారం ఇచ్చిన వారికి తగిన ప్రోత్సాహం కూడా ఇస్తామన్నారు. వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ప్రతి స్కానింగ్ సెంటర్ను తరచూ తనిఖీ చేయాలని, గర్భిణి వివరాలు ఆశావర్కర్ ద్వారా సేకరించి భ్రూణహత్యలు లేకుండా చూసి జిల్లాను ముందువరుసలో ఉంచాలని డీఎంహెచ్ వోను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో డీఎంహెచ్ వో డాక్టర్ కె.వెంకటరమణ, అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి సి.పావని, ఎస్సై జి.శ్రీదేవి, ఎన్జీవో సెక్రటరీ టి.కవిరాజు, డిప్యూటీ డెమో అనిల్ కుమార్ పాల్గొన్నారు.