- నేటి నుంచి లక్ష్మీచెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు
- ఎమ్మెల్యే గువ్వల వర్సెస్ మాజీ ఎమ్మెల్యే వంశీ వర్గీయులు
- వేడుకలు జరిపించే క్రమంలో రాజుకున్న రగడ
- విగ్రహాలను దాచిపెట్టిన పూజారులు.. ఎమ్మెల్యే ఫైర్
- వంశీ అనుచరులు 100 మంది అరెస్ట్.. అమ్రాబాద్ పీఎస్ కు తరలింపు
సామాజికసారథి, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలో ప్రకృతి రమణీయత మధ్య వెలిసిన రాయలగండి ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఎత్తయిన నల్లమల కొండలపై వెలిసిన లక్ష్మీచెన్నకేశవ స్వామి ఆలయంలో ఏటా పాల్గుణ శుద్ధపంచమి నాడు ఉత్సవాలు ప్రారంభమవుతాయి. సూర్యకిరణాలు స్వామివారి మూలవిరాట్ పాదాలపై పడటం, ఆ సమయంలో స్వామివారిని దర్శించుకుంటే ఆయురారోగ్యాలు, సుఖసంపదలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సుదూరంలో ఎక్కడ ఉన్నా కూడా ఈ ప్రాంతవాసులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తుంటారు.
ఇదీ ఆలయ విశిష్టత
దళితులే అర్చకులుగా ఉన్న బహుకొద్ది ఆలయాల్లో రాయలగండి లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయం ఒకటి. అమ్రాబాద్ నుంచి పదర వెళ్లే మద్దిమడుగు ప్రధాన రహదారిపై అమ్రాబాద్ నుంచి 5 కి.మీ. దూరంలో ఉన్న రాయలగండి వద్ద స్వామి వారి ఆలయం రహదారి పక్కనే సుమారు 300 అడుగుల ఎత్తునగుట్టపై ఉంది. ఇక్కడి నుంచి పరిసరాలు ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తాయి. ఈప్రదేశాన్ని పూర్వం పగిడిగుట్ట, సువర్ణగిరిగా పిలిచేవారు. క్రీ.శ.1536లో అమ్రాబాద్ ప్రాంతాన్ని ఏలిన చింతకుంట ప్రభువు చింతకొండ రంగారావు నిర్మించినట్లు ఆలయంలోని శాసనం ద్వారా తెలుస్తుంది. ఆయన పేరుమీదనే ఈ ప్రాంతాన్ని రంగరాయునిగండిగా రాను రాను రాయలగండిగా ప్రసిద్ధి పొందింది. ఏటా ఫాల్గుణ శుద్ధ పంచమి రోజున సూర్యకిరణాలు మూల విరాట్ పాదాలపై పడతాయి. ఈ సందర్భంగా జాతర, ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. జీవనోపాధి కోసం వలస వెళ్లిన వారు ఉత్సవాలలో పాల్గొనేందుకు వస్తారు. ఉత్సవాల సందర్భంగా శుక్రవారం స్వామివారి కల్యాణోత్సవంతో వేడుకలు ప్రారంభమవుతాయని భక్తులకు అన్నిరకాల వసతులు ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
విగ్రహాలను దాచిపెట్టారు
నాగర్ కర్నూల్ ఎంపీ రాములు, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కేటాయించిన నిధులతో భక్తుల సౌకర్యం కోసం రోడ్లు, విడిది కేంద్రాలు, తాగునీటి వసతి తదితర వాటిని ఏర్పాట్లుచేశారు. వేడుకల్లో భాగంగా ఈనెల 24న లక్ష్మీచెన్నకేశవ స్వామివారి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు దేవాదాయశాఖ అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. కాగా, రాయలగండి ఆలయంలో పూజలు చేసే క్రమంలో ఒకే సామాజికవర్గానికి చెందిన రెండు ఉపకులాల మధ్య రాజకీయ రగడ రాజుకుంది. మాదిగ, మాల వర్గాలకు చెందినవారు స్వామివారికి పూజలు చేస్తున్నారు. తాజాగా రెండు గ్రూపులుగా విడిపోయి కార్యక్రమాల నిర్వహణ పట్ల అభ్యంతరం చెబుతున్నారు. దీనితో పెద్దఎత్తున మాలల ఆధ్వర్యంలో గురువారం ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ కల్యాణం జరిపించవద్దని గుడిలో ఉన్న దేవుడి విగ్రహాలను మాజీ ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ వర్గీయులు దాచిపెట్టారు. దీంతో ఒకింత ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ ఆ విగ్రహాలను ఇస్తే సరి.. లేకపోతే కొత్త విగ్రహాలను తెచ్చించి కల్యాణోత్సవాన్ని జరిపిస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా సాగేందుకు వీలుగా డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు కలిసి మొత్తం 150 మందితో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. చివరికి మాజీ ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ వర్గీయులు 100 మందిని అరెస్ట్ చేసి అమ్రాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం బ్రహ్మోత్సవాలను ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రారంభించారు. కార్యక్రమంలో మద్దిమడుగు ఆంజనేయస్వామి టెంపుల్ చైర్మన్ విష్ణుమూర్తి, అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ ఎడ్ల నర్సింహగౌడ్,బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పోకల మనోహర్, పలువురు నేతలు పాల్గొన్నారు.