Breaking News

మల్లన్నసాగర్ ​తెలంగాణ జలహృదయం

మల్లన్నసాగర్​తెలంగాణ జలహృదయం
  • కాళేశ్వరంతో స్వరాష్ట్రం ముఖచిత్రం మారింది
  • ఎందరో త్యాగం చేసి భూములు ఇచ్చారు..
  • ముంపు బాధితులను అందరినీ ఆదుకుంటాం
  • ఎండనక, వాననక కష్టపడి పనిచేశారు..
  • ఇంజినీర్లు, కార్మికులందరికీ సెల్యూట్​ చేస్తున్నా..
  • ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన సీఎం కేసీఆర్​

సామాజికసారథి, సిద్దిపేట: దేశం మొత్తం కరువు ఉన్నా.. ఇక తెలంగాణలో మాత్రం ఆ ఛాయలే రావని సీఎం కె.చంద్రశేఖరావు అన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో నిర్మించిన ప్రాజెక్టులతో ఈ ప్రాంతం నిరంతరాయంగా జలాలను అందిస్తుందని చెప్పారు. ప్రాజెక్టులతో పాటు చెరువులు, కుంటను నింపుకోవడంతో ఇక వ్యవసాయానికి కూడా ఢోకా ఉండబోదన్నారు. ఇంతపెద్ద ప్రాజెక్టులో కొందరికి నష్టపరిహారంలో ఇంకా అసంతృప్తులు ఉన్నాయని అన్నారు. కొన్ని గ్రామాలను కోల్పోయామని, ఎందరో త్యాగం చేసి భూములు అందించారని అన్నారు. అలాంటి వారికి ఇంతపెద్ద ప్రాజెక్టు సందర్భంగా వారు దుఃఖించడం సరికాదు. మరో వందకోట్లు అయినా ఫర్వాలేదు. అలాంటి వారికి ప్యాకేజీ ఇవ్వాలని మంత్రి హరీశ్​రావు, జిల్లా కలెక్టర్​కు సూచించారు. ఇంతపెద్ద ప్రాజెక్టులో అదో చిన్న మొత్తమేనని చెప్పారు. ‘ఇది ఒక మల్లన్న సాగర్‌ కాదు.. తెలంగాణ జలహృదయ సాగరం.. తెలంగాణ మొత్తాన్ని జలాలతో అభిషేకించే సాగరం’ అని సీఎం కేసీఆర్​అభివర్ణించారు. సిద్దిపేట జిల్లా తుక్కాపూర్​నిర్మించిన మల్లన్నసాగర్‌ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన తర్వాత ఇక్కడ ఏర్పాటుచేసిన బహిరంగసభలో కేసీఆర్‌ ప్రసంగించారు. సభలో మంత్రులు హరీశ్​రావు, వి.శ్రీనివాస్​గౌడ్, ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సస్యశ్యామల తెలంగాణను చూస్తున్నాం
‘‘మల్లన్నసాగర్‌ ప్రాజెక్టును ప్రారంభించుకోవడం చాలా ఆనందం, సంతోషంగా ఉంది. మనం కలలుగన్న తెలంగాణ రాష్ట్రంతో పాటు సస్యశ్యామల తెలంగాణను చూస్తున్నాం. నూతన తెలంగాణ రాష్ట్రంలో నిర్మించిన అతి భారీ జలాశయం మల్లన్న సాగర్‌ను ప్రారంభించుకోవడం హర్షించుకోదగిన విషయం. ఈ మహాయజ్ఞంలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతున్నా. కాళేశ్వరం ప్రాజెక్టులో 58వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. ఆ సమయంలో దుర్మార్గులు కోర్టుల్లో కేసులు వేశారు. అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నాను. అక్కడి నుంచే మన రాష్ట్ర చీఫ్‌ జస్టిస్‌కు ఫోన్‌ చేసి.. ఇది తెలంగాణ జీవనాడి.. ఉన్నతంగా ఆలోచించి ఈ ప్రాజెక్టును కాపాడాలని కోరాను. ఆ తర్వాత ఈ ప్రాజెక్టుపై స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. దాదాపు 600 పైచిలుకు కేసులు వేశారు. ఇంజినీర్లు రిటైర్డ్​అయినా కూడా ఈ ప్రాజెక్టు కోసం పనిచేశారు. ఇంజినీర్లు అందరికీ సెల్యూట్‌. ఎండనక, వాననక, రాత్రింబవళ్లు కష్టపడి పనిచేశారు. భయంకరమైన కరువు నేలలో ప్రజలకు న్యాయం చేసేందుకు పోరాడాం. కొందరు దుర్మార్గమైన పద్ధతుల్లో ప్రగతి నిరోధక శక్తులుగా మారారు’’ అని సీఎం కేసీఆర్​మండిపడ్డారు.

సభలో ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్​

లక్ష్యంతో ముందుకు సాగాం
‘‘గోదావరి నీళ్లు తెచ్చి కొమురవెల్లి మల్లన్న పాదాలను కడుగుతామని చెప్పాం. గోదావరి జలాలతో అభిషేకం చేయబోతున్నాం. ఎంతో మనసు పెట్టి ముందుకు పోయాం. హరీశ్‌రావు సేవలు కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నాయి. అవినీతిరహితంగా పనిచేశాం. ఇది ఒక మల్లన్న సాగర్‌ కాదు.. తెలంగాణ జన హృదయం సాగరం. తెలంగాణ మొత్తాన్ని జలాలతో అభిషేకించే సాగరం. సింగూరు ప్రాజెక్టును తలదన్నేలా ఈ ప్రాజెక్టును నిర్మించారు. సిద్దిపేటకే కాకుండా హైదరాబాద్‌ నగరానికి శాశ్వతంగా దాహార్తిని తీర్చే ప్రాజెక్టు ఇది. 20 లక్షల ఎకరాలను తన కడుపులో పెట్టుకుని కాపాడుకునే ప్రాజెక్టు” అని సీఎం కేసీఆర్​పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఇక బోర్లలో నీరు ఉండదనే సమస్యరాదన్నారు. చిన్నిచిన్నపొరపాట్లు జరిగినా ప్రాజెక్టును అనుకున్న లక్ష్యంతో ముందుకు సాగామన్నారు. ఇటు మల్లన్న సాగర్‌ వద్ద దుబాయ్‌ బురుజును మించేలా ఇక్కడ కలర్‌ ఫౌంటేన్‌ ఏర్పాటు చేయాలన్నారు. ఇక్కడ మల్లన్నసాగర్‌, పక్కనే కొమురవెల్లి మల్లన్న, మరోవైపు యాదాద్రి నిర్మాణంతో ఈ ప్రాంతం అద్భుతంగా ఉండబోతోందని చెప్పారు.

మల్లన్న సాగర్​ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్​

50టీఎంసీలు.. 11.29 లక్షల ఎకరాలకు సాగునీరు
కాళేశ్వరం ప్రాజెక్టులో అతిపెద్ద రిజర్వాయర్​అయిన మల్లన్న సాగర్‌ లోకి నీటిని విడుదల చేశారు సీఎం కేసీఆర్‌. ప్రత్యేక పూజల అనంతరం స్విచ్ఛాన్‌ చేసి నీటిని రిలీజ్‌ చేశారు. రిజర్వాయర్‌ ను జాతికి అంకితం చేశారు. రాష్ట్రంలోని ఎస్సారెస్పీ తర్వాత అతిపెద్ద రిజర్వాయర్‌ మల్లన్నసాగర్‌. సిద్దిపేట జిల్లా తొగుట, కొండపాక మండలం సరిహద్దులో దీనిని నిర్మించారు. 8 గ్రామాలతో పాటు మొత్తం 14 శివారు గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురయ్యాయి. దీని సామర్థ్యం 50 టీఎంసీలు. సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్‌ నుంచి సొరంగం ద్వారా తుక్కాపూర్‌ పంప్‌ హౌస్‌ కు చేరిన గోదావరి జలాలను మల్లన్నసాగర్‌ లోకి ఎత్తిపోస్తారు. ఈ రిజర్వాయర్‌ తో మొత్తంగా ఉమ్మడి మెదక్‌ తో పాటు ఉమ్మడి నల్లగొండ, నిజామాబాద్‌ జిల్లాలోని సుమారు 11.29 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ రిజర్వాయర్‌ కు ఐదు తూములు(స్లూయిజ్‌ లు) ఉన్నాయి. వీటి ద్వారా కొండపోచమ్మ, గంధమల్ల రిజర్వాయర్‌, సింగూర్‌ ప్రాజెక్టు, తపాస్‌ పల్లి రిజర్వాయర్‌, మిషన్‌ భగీరథకు నీటిని తరలిస్తారు. అంతేగాకుండా హైదరాబాద్‌ తాగునీటి కోసం 20 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాల కోసం16 టీఎంసీలు వాడతారు. కార్యక్రమంలో మంత్రి టి.హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.