- తెలంగాణ సాగునీటి ముఖచిత్రాన్నే మార్చేసింది
- ఇదే స్ఫూర్తితో తుపాకులగూడెం, దుమ్ముగూడెం పనులు
- కాళేశ్వరం పర్యటనలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు
- ముక్తేశ్వరస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు
సారథి న్యూస్, భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అనుకున్న సమయంలో ఆశించిన రీతిలో పూర్తయి నీటి పంపింగ్ కూడా నిరాటంకంగా సాగుతోందని సీఎం కె.చంద్రశేఖర్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తికావడంలో కృషిచేసిన నీటిపారుదల శాఖాధికారులు, వర్కింగ్ ఏజెన్సీలు, ఇతర శాఖల ఉద్యోగులను ఆయన అభినందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన స్ఫూర్తితోనే రాష్ట్రంలో చేపట్టిన ఇతర భారీ ప్రాజెక్టులను కూడా పూర్తిచేయాలని ఆదేశించారు. కాళేశ్వరం పర్యటనలో భాగంగా మంగళవారం సీఎం కేసీఆర్.. సతీమణి శోభతో కలిసి మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీబ్యారేజీని సందర్శించారు. కాళేశ్వరం ముక్తేశ్వరస్వామి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. మంత్రులు, ఇతర నాయకులు, అధికారులతో కలిసి గోదావరి జలాలకు పుష్పాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా ఎదురైన అనుభవాలను నెమరు వేసుకున్నారు. సాగునీరు లేక తెలంగాణ రైతాంగం దశాబ్దాల తరబడి గోసను అనుభవించిందన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న ఫలితం సంపూర్ణంగా దక్కాలంటే రైతులు రెండు పంటలను సమృద్ధిగా పండించేందుకు సాగునీరు అందించి తీరాలని మొదట్లోనే నిర్ణయించుకున్నామని సీఎం గుర్తుచేశారు.
శాస్త్రీయంగా సర్వే
వ్యాప్కోస్ సంస్థ ద్వారా శాస్త్రీయంగా సర్వే నిర్వహించి మేడిగడ్డ పాయింట్ వద్ద బ్యారేజీ నిర్మించాలని నిర్ణయించామని సీఎం కేసీఆర్ వివరించారు. 16.17 టిఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో దాదాపు 100 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించడం ద్వారా దాదాపు ఏడు నెలల పాటు నీటిని పంపింగ్ చేయొచ్చని అంచనా వేశామన్నారు. మేడిగడ్డ పాయింట్ నుంచి 54 కి.మీ. వరకు ప్రాణహితలో, 42 కి.మీ. వరకు గోదావరిలో నీరు నిల్వ ఉండడంతో జలకళ ఉట్టిపడుతోందన్నారు.
సాగునీటి ముఖచిత్రాన్నే మార్చివేసింది
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సాగునీటి ముఖచిత్రాన్నే మార్చివేసిందన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మించిన స్ఫూర్తితోనే దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించిన తుపాకులగూడెం బ్యారేజీ, సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన దుమ్ముగూడెం బ్యారేజీ నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయని వివరించారు. ఆయా బ్యారేజీల వద్ద కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అన్ని ప్రాజెక్టులకు సంబంధించి ఆపరేషన్ రూల్స్ రూపొందించాలని సూచించారు. కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, నీటిపారుదల శాఖ ఈఎన్సీలు మురళీధరర్ రావు, వెంకటేశ్వర్లు, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.