Breaking News

విశ్వసుందరిగా హర్నాజ్‌ సంధు

విశ్వసుందరిగా హర్నాజ్‌ సంధు
  • మిస్‌ యూనివర్స్‌గా పంజాబ్‌ సుందరి
  • 21ఏళ్ల తర్వాత భారత యువతికి కిరీటం
  • సుస్మితా సేన్‌, లారాదత్తా తర్వాత ఆమెకే

న్యూఢిల్లీ: మిస్‌ యూనివర్స్‌ 2021 పోటీల్లో భారత్‌ తరఫున ప్రాతినిథ్యం వహించిన 21 ఏళ్ల పంజాబ్‌ సుందరి హర్నాజ్‌ కౌర్‌ సంధు విజేతగా నిలిచారు. దీంతో 21 ఏళ్ల తర్వాత భారత్‌కు విశ్వసుందరి కిరీటం వరించింది. ఈ ఏడాది ‘లివా మిస్‌ దివా యూనివర్స్‌’ కిరీటాన్ని సొంతం చేసుకోవడంతో హర్నాజ్‌కు ‘మిస్‌ యూనివర్స్‌ 2021’లో భారత్‌ తరఫున పోటీచేసే అవకాశం దక్కింది. అంతకుముందు హర్నాజ్‌ 2019లో ‘మిస్‌ ఇండియా పంజాబ్‌’గా నిలిచారు. అనంతరం ఆమె ‘లివా మిస్‌ దివా యూనివర్స్‌’లో పాల్గొని కిరీటం దక్కించుకున్నారు. తాజాగా ఇజ్రాయిల్‌లో జరిగిన 70వ మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో పాల్గొన్న హర్నాజ్‌ కౌర్‌ విజేతగా నిలిచి విశ్వసుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. గతంలో భారత్‌ నుంచి మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని సుస్మితాసేన్‌ (1994), లారాదత్తా(2000) సాధించారు. 21 ఏళ్ల తర్వాత ఇప్పుడు హర్నాజ్‌ సంధు దక్కించుకోవడం విశేషం.

మోడలింగ్​లో రాణించిన సంధు

మొదట మోడలింగ్‌లో బాగా రాణించిన హర్నాజ్‌ ఆ తర్వాత చాలా తక్కువ వ్యవధిలోనే పంజాబీ చిత్రాల్లో నటించే అవకాశాలను చేజిక్కించుకున్నారు. ఇప్పటికే ఆమె నటించిన రెండు పంజాబీ చిత్రాలు 2022లో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక మోడల్‌గానూ ఎన్నో వేదికలపై మెరిసిన హర్నాజ్‌ ఇప్పుడు ఇలా విశ్వ వేదికపై ఏకంగా మిస్‌ యూనివర్స్‌గా టైటిల్‌ సాధించడం విశేషం. ఈసారి తప్పకుండా కిరీటం సాధించి సుస్మితాసేన్‌, లారాదత్తాల సరసన చేరతానని ముందే చెప్పారు. అన్నట్లే విజయం సాధించి దేశం గర్వపడేలా చేశారు. హర్నాజ్‌ ప్రస్తుతం పీజీ చదువుతున్నారు.

ఇక ఫైనల్‌ రౌండ్‌లో ముగ్గురు ఫైనలిస్టులు మిగిలారు. వీరిని జడ్జిలు ‘ఈ షో చూస్తున్న మహిళలుకు మీరిచ్చే సలహా ఏమిటని’ ప్రశ్నించారు. మిస్ సౌత్ ఆఫ్రికా, మిస్ పరాగ్వేతో పాటు మిస్ ఇండియా హర్నాజ్ చక్కగా సమాధానమిచ్చి పోటీ రౌండ్‌లను ముగించారు. ముగ్గురిలో అత్యుత్తమ సమాధానం చెప్పిన హర్నాజ్‌ను కిరీటం వరించింది. ఆమెను విజేతగా ప్రకటించి.. మిస్ మెక్సికో నుంచి కిరీటాన్ని మిస్ ఇండియా హర్నాజ్‌కు అందించారు. విశ్వసుందరిగా నిలిచిన ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు.

మిమ్మల్ని మీరు నమ్మండి

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం యువత ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు.. తమను తాము నమ్మకపోవడం. మీకు మీరే ప్రత్యేకం అని నమ్మండి.. అదే మిమ్మల్ని అందంగా చేస్తుంది. ఇతరులతో పోల్చుకోవడం ఆపేసి.. ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి మాట్లాడండి. భయాల నుంచి బయటకు రండి.. మీ గురించి మీరే మాట్లాడండి.. ఎందుకంటే మీ జీవితానికి మీరే లీడర్‌. మీకు మీరే గొంతుక. నన్ను నేను నమ్మాను. అందుకే ఈ రోజు ఈ వేదిక మీద నిల్చోగలిగాను’ అని సమాధానమిచ్చారు.